Lokesh Statement on Defamation Case in Mangalagiri Court: తాను ఒక నియంతపై.. ఒక పెత్తందారు, వైసీపీ గ్లోబల్ ప్రచారంపై పోరాటం చేస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలతో నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలు చేసినందకు.. పోసానిపై, సింగలూరు శాంతి ప్రసాద్‌పై పరువునష్టం కేసు దాఖలు చేయగా.. తన వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు. నిందలపై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో తానే విజయం సాధించనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తన తల్లి దగ్గర్నుంచి తన కుమారుడు దేవాన్ష్ వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా.. అందరిపై వైసీపీ నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేశారని ఎవర్ని వదిలిపెట్టానని లోకేశ్ హెచ్చరించారు. చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందని ఆయన అన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి తనపై తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. మంగళగిరి కోర్టును లోకేశ్ ఆశ్రయించగా.. శుక్రవారం తన వాంగ్మూలన్ని కోర్టుకు అందించారు.
పోసాని ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో.. లోకేశ్ కంతేరులో 14 ఎకరాల భూముల్ని కొనుగోలు చేశారనే ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కంతేరుల తనకు అరసెంటు భూమి కూడా లేదని వివరించారు. తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని క్షమాపణ చెప్పాలని.. తన న్యాయవాది ద్వారా గతంలో రెండు సార్లు నోటీసులు పంపించినట్లు వివరించారు. అయినప్పటికీ పోసాని స్పందించలేదని.. ఎటువంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోర్టును ఆశ్రయించారు..