మహానాడు ప్రాంతంలో నారా లోకేష్ పరామర్శ శాసనసభలో తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశం నుంచి జనం దృష్టి మళ్లించేందుకే.. మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో కరోనాతో మృతిచెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
"శాసనసభలో నా తల్లిని అవమానించారు. ఆ అంశం నుంచి జనం దృష్టి మళ్లించేందుకే మళ్లీ మూడు రాజధానుల రాగాన్ని సీఎం జగన్ ఆలపిస్తున్నారు."
-నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మహిళలు పలు సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టడం లేదని మహిళలు చెప్పారు. అభివృద్ధి పేరుతో తమ ఇళ్లను తొలగిస్తున్నారని వాపోయారు.
స్పందించిన లోకేశ్.. ప్రజల గురించి ఒక్క తేదేపానే ఆలోచిస్తోందన్నారు. వారి సమస్యలపై పోరాడుతోందని అన్నారు. అయితే.. ఒక సమస్యపై పోరాడి, దానికి పరిష్కారం వచ్చే లోపే.. ప్రభుత్వం మరో సమస్యను తెర పైకి తెచ్చిపెడుతోందని విమర్శించారు.
రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందన్న లోకేశ్.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కర్మాగారం అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. కడప జిల్లాలో భారీ వరదలు వచ్చి 41 మంది చనిపోయినా.. ఇంతవరకూ సీఎం ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:Chandrababu: ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే.. ఇంత నష్టం జరిగేదా?: చంద్రబాబు