రాజధాని అమరావతి కొనసాగించాలని కోరుతూ బాపట్ల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐకాస ఏర్పాటైంది. పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి... లోకేశ్‌తోపాటు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా నేతలు జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, కరణం బలరాం, కృష్ణా, ప్రకాశం జిల్లాల నేతలు, ఐకాస నాయకులు హాజరయ్యారు. అంబేడ్కర్ భవన్ నుంచి జమ్ములపాలెం అంబేడ్కర్ విగ్రహం వరకు పట్టణంలో కిలో మీటరు మేర జోలె పట్టి అమరావతి ఉద్యమానికి విరాళాలు సేకరించారు. 5 ఏళ్లుగా అమరావతిని చంటి బిడ్డలాగా చంద్రబాబు పెంచుతూ ఉంటే.. ఆ బిడ్డను చంపి తల ఒక ప్రాంతంలో కాళ్లు, చేతులు మరో ప్రాంతంలో... మొండెం అమరావతిలో మిగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ అన్నారు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. వారిని రెచ్చగొట్టిన ఎమ్మెల్యేపైన కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆడవారిపైన అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా... మహిళలపై పోలీసులే దాడులు చేస్తున్నారన్నారు. మహిళా కమిషన్ సభ్యులను కలిసేందుకూ అవకాశం ఇవ్వలేదని చెప్పారు. మహిళలు తిరగబడితే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెప్పారు.
'ఆంధ్రప్రదేశ్ పొమ్మంటే.... తెలంగాణ రారమ్మంటోంది...' - ఏపీలో రాజధాని వార్తలు
తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలు చేశామని.. ఇప్పటి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే వారిని వెళ్లమని చెబుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు రారామ్మని ఆహ్వానిస్తున్నారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్