Lokesh Comments on Chandrababu Health :చంద్రబాబు మానసికంగా చాలా బలంగా ఉన్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆ పార్టీ నాయకులకు తెలిపారు. ఆయన ఎనర్జీ ఎక్కడా తగ్గలేదన్న లోకేశ్, కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని వెల్లడించారు. వైద్య కారణాలతో తాను బయటకు రానని నాలుగు రోజులు ఆలస్యమైనా స్వచ్ఛంగా బయటకు వస్తానని చంద్రబాబు స్పష్టం చేసిన్నట్లు నాయకులకు వివరించారు. ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడీ తేవొద్దని చెప్పారన్నారు. ములాఖత్‌కి వెళ్లినప్పుడు చంద్రబాబు కుటుంబం గురించి కాకుండా నాయకులు, కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారని లోకేశ్ తెలిపారు.
Lokesh Comments on Removing Votes :తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన టీడీపీ రాష్ట్ర విసృత్త స్థాయి సమావేశంలో ఓట్ల తొలగింపు, పార్టీ సంస్థాగత నిర్మాణం, నిజం గెలావాలి అనే అంశాలపై అంతర్గతంగా చర్చ జరిగింది. ఎన్నికలకు 5 నెలలే సమయం ఉందన్న లోకేశ్.. కొంతమంది నేతల పనితీరు ఇంకా మారాలని స్పష్టం చేశారు. ఒకటికి రెండు సార్లు చెబుతాం, మారకుంటే కష్టమన్నారు. మెహమాటానికి వెళ్లి పార్టీకి నష్టం చేయలేమని ఆయన తేల్చిచెప్పారు.
సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాలని నేతలకు పిలుపునిచ్చారు. ఫేక్ అకౌంట్లతో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య వైసీపీ బ్యాచ్ గొడవలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తిప్పి కొడుతూ ప్రజల్లోకి నిజాల్ని తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అక్టోబరు 27 నుంచి ఓటర్ల ముసాయిదా జాబితా వస్తుందన్న లోకేశ్.. అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్‌స్థాయిల్లో మండల, గ్రామ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పని చేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని ప్రజల్ని అప్రమత్తం చేయాలని లోకేశ్ సూచించారు.
TDP Super Six Guarantees :చంద్రబాబు అరెస్టు తర్వాత నిలిచిన "బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ (Babu Surety Future Guarantee Program)" కార్యక్రమాన్ని నవంబరు 1నుంచి డిసెంబరు 15వరకు లోకేశ్ చేపట్టనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు లోకేశ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అధినేత కొనసాగిస్తారు. ఈ 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వ అరాచకాల్ని వివరించాలని లోకేశ్ సూచించారు.