గుంటూరు జిల్లాలో కరోనా కేసుల తీవ్రత తగ్గుతున్న ప్రాంతాల్లో ఆంక్షలు సడలించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రెడ్జోన్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు వచ్చే వీలులేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు, నరసరావుపేటలో కొన్నిచోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అధికారులు అప్రమత్తమై శుక్రవారం నాడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రస్తుతం గుంటూరులో 8, నరసారావుపేటలో 6, తాడేపల్లిలోని 2 ప్రాంతాల్లో రెడ్ జోన్లు ఉన్నాయి. అయితే గత 28 రోజులుగా పాజిటివ్ కేసులు లేని ప్రాంతాలను రెడ్ జోన్ల నుంచి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా ఆంక్షలు కొనసాగుతాయి. ఈ ప్రకారం గుంటూరులోని 4 ప్రాంతాలు, నరసరావుపేటలోని 2 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ల నుంచి తొలగించారు. పాజిటివ్ కేసులు ఉన్న పరిసర ప్రాంతాల్లో 200 మీటర్లకు దూరంలో దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. గతంలో ఈ అవకాశం లేక ప్రజలు నిత్యావసర సరకుల కోసం ఇబ్బందులు పడేవారు. ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.