ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి జాగ్రత్త.. ప్రాణం మీదకు తెస్తోందిలా..! - గుంటూరులో కరోనా ఎఫెక్ట్

కరోనా పట్ల అతిభయం... అవగాహనా రాహిత్యంతో కొన్నిచోట్ల ప్రజలు తీసుకుంటున్న అతి జాగ్రత్తలు.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కరోనాను నియంత్రించే క్రమంలో, లాక్ డౌన్ అమలు చేసే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో సరిహద్దులు మూసేస్తున్నారు. అలాంటి గ్రామాలకు అంబులెన్సుల వంటి అత్యవసర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.

lock down effect in guntur
lock down effect in guntur

By

Published : Apr 28, 2020, 1:46 PM IST

Updated : Apr 28, 2020, 2:54 PM IST

అతి జాగ్రత్త.. ప్రాణం మీదకు తెస్తోందిలా..!

రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, దాచేపల్లి ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. దీంతో అధికారులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ప్రజలు కూడా లాక్ డౌన్ ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఎవరూ తమ గ్రామాల్లో రాకుండా చర్యలు చేపడుతున్నారు.

గ్రామాల సరిహద్దుల వద్ద ముళ్ల కంచెలు, దుంగలు, పెద్దపెద్ద బండరాళ్లు అడ్డు వేస్తున్నారు. వైరస్ ను నియంత్రించే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన లాక్ డౌన్ అమలు చేయాలనే ఉద్దేశం మంచిదే. అయితే అదే సమయంలో ఆయా గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైనా... గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా... అంబులెన్సులు రావటానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.

మార్చి 27న దుగ్గిరాలలో ఓ వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుంటే అంబులెన్సు రెండు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. పెద్దపెద్ద తాటిచెట్లను తొలగించటానికి సిబ్బందికి వీలు పడలేదు. దీంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆటోలో అంబులెన్సు వద్దకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

ఏప్రిల్ 25న అర్థరాత్రి సమయంలో యడ్లపాడు మండలం పుట్టకోటలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలై అంబులెన్సు కోసం ఫోన్ చేశారు. అప్పుడు కూడా ముళ్ల కంచెల కారణగా అంబులెన్సు గ్రామంలోకి రాలేకపోయింది. సమయానికి గ్రామంలో ఉన్న ఏ.ఎన్.ఎం ఆ మహిళకు పురుడు పోసింది. ఆ తర్వాత ఆటోలో అంబులెన్సు వద్దకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కాన్పు కష్టంగా మారితే ఆ మహిళ పరిస్థితి ఏంటనేది ఊహించేందుకే భయపడేపరిస్థితి.

ఇక మరికొన్నిచోట్ల రోడ్డుకు అడ్డంగా తాళ్లు కడుతున్నారు. రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు వాటిని చూసుకోకుండా వెళ్లి ప్రమాదాలకి గురవుతున్నారు. మార్చి 28న బాపట్ల మండలం పూడ్ల వద్ద రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు తగిలి బైక్ మీద వెళ్తున్న కూనపురెడ్డి సుబ్బారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బారావు మరణించాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

కొన్నిచోట్ల కంచెలు వివాదాలు రేపుతున్నాయి. పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం వద్ద ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద బండరాళ్లు అడ్డుపెట్టారు. ఇది పొన్నూరు వెళ్లే దారి కావటంతో అత్యవసర పనుల మీద వెళ్లేవారికి, వచ్చేవారికి ఆటంకంగా మారింది. రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలోని రహదారిపై ముళ్లకంపలు వేసి గ్రామంలోకి ఎవరినీ రానివ్వకుండా స్థానిక యువకులు అడ్డుకుంటున్నారు. రొంపిచర్ల మండల కేంద్రానికి నిత్యావసర సరకులు, మందులు కొనుగోలుకు వెళ్లేవారు బుచ్చిపాపన్నపాలెం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ తాడు కట్టి రాకపోకలను అడ్డుకోవటంతో ఇతర గ్రామాల వారు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇవి ముదిరితే ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది.

ఇలాంటి సంఘటనలు వెలుగుచూడనివి చాలానే ఉన్నాయి. కంచె వేసిన వారు అక్కడ తప్పనిసరిగా ఉండాలి. అత్యవసర వాహనాలు, వ్యక్తులను పంపించేలా ఏర్పాట్లు ఉండాలి. అలా చేయకుండా అడ్డంకులు సృష్టించటం తోటివారి ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి విషయాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇవీ చదవండి:

ఆపత్కాలంలో వెంటిలేటర్లు ఊపిరి పోస్తాయి.. కానీ!

Last Updated : Apr 28, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details