కరోనా కంటే.. కాలే కడుపులే ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి పరిస్థితి కరోనా వ్యాప్తి కారణంగా.. దారుణంగా మారింది. హోటళ్లు, ధాబాలు, టిఫిన్ దుకాణాలు... వీధుల్లో తినుబండారాలు అమ్మే వారి పరిస్థితి దయనీయంగా మారింది.
గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ తో మూడు నెలలపాటు దుకాణాలు తెరవలేదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల తర్వాత.. దుకాణాలు తెరుచుకున్నాయి. అయినా హోటళ్లు, దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కరోనా భయంతో వాటివైపు వెళ్లడానికే చాలామంది భయపడుతున్నారు. రోజుకు ఒకప్పుడు 5 నుంచి 6 వేల వ్యాపారం చేసే కాకాహోటళ్లు.. ఇప్పుడు వెయ్యి నుంచి 2వేల రూపాయలకు మించడం లేదంటున్నారు. ఓ మోస్తరు హోటళ్లయితే 4 వేల నుంచి 20 వేల వరకు వ్యాపారాలు చేస్తుండగా... ఇప్పుడు 3 నుంచి 5 వేలు దాటడం లేదంటున్నారు.
ఇంటి, దుకాణం అద్దెలు, కరెంటు బిల్లులు, సిబ్బందికి జీతాలు.. ఈ ఖర్చులు భరిస్తూ హోటళ్లు, దుకాణాలు నిర్వహించడం.. తలకు మించిన భారంగా భావిస్తున్నారు. ఈ గండం నుంచి బయట పడతామో లేదో అన్న ఆందోళన అందరినీ వేధిస్తోంది. లాక్ డౌన్ తో ఇప్పటికే ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారుల్లో కొందరు.. అప్పులు చేసి మరీ హోటళ్లు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ తో మూసిన హోటళ్లు, దుకాణాలను తెరిచే సాహసమే చేయట్లేదు మరికొందరు.