Funds Misuse in AP: రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు ఈ మధ్య పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మేరకు పోర్టుల నిర్మాణానికి, ఇతరత్రా అవసరాలకు ఈ రుణాలు తీసుకున్నాయి. నిజానికి కార్పొరేషన్లకు ఇచ్చిన రుణాలు ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధం. కార్పొరేషన్ల నిధులు ప్రభుత్వ అవసరాల కోసం మళ్లిస్తే కేంద్రం నిర్ణయించిన నికర రుణ పరిమితిలో వాటిని కూడా కలిపి లెక్కించాలని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి మూడో వారంలో వివిధ కార్పొరేషన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు.. ఐదు వేల కోట్ల రూపాయల వరకూ మళ్లాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు, అప్పుల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యక్తులు.. రుణాలిచ్చిన ఆయా సంస్థలకు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఎనర్జీ కార్పొరేషన్ పేరిట రుణాలు మంజూరు చేసిన గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అప్రమత్తమైంది. తాము రుణంగా ఇచ్చిన మొత్తం.. నిల్వ ఉందో లేదో చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అధికారులకు తాఖీదు పంపినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాలను రాష్ట్ర ఖజానాకు ఎందుకు మళ్లించారు? ఏం చెప్పి అప్పు తీసుకున్నారు? వాటిని ఖజానాకు ఎందుకు మళ్లించారని నిలదీసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎనర్జీ కార్పొరేషన్ గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌కు ఎప్పట్నుంచో 2 వేల 200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దాదాపు మూడు నాలుగు నెలలుగా.. ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని.. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ అధికారులు.. ఏపీ ఎనర్జీ కార్పొరేషన్‌తో పాటు ఆర్థికశాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే తమ వద్ద నిధుల్లేవంటూ.. అధికారులు నెట్టుకొస్తున్నారు.