గుంటూరు జిల్లా పెదపూడి వంతెన సమీపంలో మద్యం తీసుకు వెళుతున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలో పడింది. తెనాలి ప్రభుత్వ మద్యం డిపో నుంచి చుండూరు మండలంలోని మోదుకూరు ప్రభుత్వ మద్యం దుకాణానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అధికారులు స్పందించి క్రేన్ సాయంతో ఆ మద్యం వాహనాన్ని బయటికి తీశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పింది. ఈ సమయంలో డ్రైవర్, క్లీనర్ ప్రభుత్వ మద్యం దుకాణాల అసిస్టెంట్.. వాహనంలో ఉన్నారు. కాలువలో పడిన వెంటనే డోర్లు ఓపెన్ చేద్దామని ప్రయత్నించిన అవి తెరుచుకోలేదు. మరో పది నిమిషాలు నీటిలోనే ఉంటే వాళ్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడేది. ఇంతలోనే డోర్లు తెరుచుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
కాలువలోకి మద్యం వాహనం.. నీటిపాలైన లిక్కర్ - Liquor vehicle felldown into canal at Pedapudi
ప్రభుత్వ దుకాణానికి మద్యాన్ని తరలిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. గుంటూరు జిల్లా పెదపూడి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది.
వాహనంలో మొత్తం 12 లక్షల 50 వేల సరకును తీసుకువెళుతున్నట్టు ఎక్సైజ్ సీఐ సీహెచ్ శ్రీనివాస మూర్తి తెలిపారు. 121 పెట్టెల్లో లిక్కరు, 25 పెట్టెల్లో బీర్ బాటిల్స్ తరలిస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని బయటికి తీసే క్రమంలోనే చాలా మద్యం నీటిపాలైంది అని తెలిపారు. కొన్ని ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు కొట్టుకుపోయినట్లు వివరించారు. కాలువలోని నీటి ఉధృతికి దాదాపుగా మద్యం బాటిళ్లు చందోలు వరకు కొట్టుకుపోయాయని తెలిపారు. నీటి పాలైన మద్యం విలువ సుమారు ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఉండొచ్చని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస మూర్తి ప్రాథమిక అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండీ..సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేతులు తడిపితేనే పనయ్యేది..!