రాష్ట్రంలో నేటి నుంచి మద్యం అమ్మకాలు రాష్ట్రంలో కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా చోట్ల ఉన్న మద్యం దుకాణాలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. 25శాతం పెరిగిన ధరతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 వరకూ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మాల్స్‌లో ఉన్న మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశాల్లో తెలిపింది. దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ధరను 25శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మద్యం కొనుగోలుకు వచ్చేవారు.. కచ్చితంగా మాస్కు ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి దుకాణం వద్దకు ఐదుగురినే అనుమతిస్తామని... వారు సైతం 6 అడుగుల దూరంలో నిలబడి ఉంటారని అబ్కారీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు.
మద్యం దుకాణాలకు ప్రజలు పెద్దగా పోటెత్తితే స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని, అవసరమనుకుంటే కొద్దిసేపు దుకాణాలు మూసివేసైనా సరే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు సూచించారు.
మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు రీటైల్ ఎక్సైజు ట్యాక్సు పేరిట ధరలు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. భారత్‌లో తయారైన విదేశీ మద్యం, బీర్లు, ఇతర మద్యంపై ధరల పెంపుచూ ఆదేశాలు జారీచేశాయి.
- 180 ఎంఎల్ రూ.120 వరకు ఉండే వాటిపై రూ.10 నుంచి రూ.240 పెంపు
- 180 ఎంఎల్ రూ.150 వరకు ఉండే మద్యంపై రూ.20 నుంచి రూ.480 వరకు పెంపు
- రూ.150 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యంపై రూ.30 నుంచి రూ.720 వరకు పెంపు
- బీర్లు 330 ఎంఎల్‌కు రూ.20 నుంచి 5 లీటర్ల బాటిల్‌కు 3000 వరకు పెంపు
అబ్కారీ శాఖ మార్గదర్శకాలు
- మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం తప్పనిసరి
- మద్యం కొనేవాళ్లు, అమ్మేవాళ్లు విధిగా మాస్కులు ధరించాలి
- దుకాణాల్లో విధిగా శానిటైజర్లు ఉండాలి
- దుకాణం వద్ద ఒకసారి ఐదుగురు కంటే ఎక్కువమంది ఉండకూడదు
- మద్యం దుకాణాల ముందు 6 అడుగుల దూరం పాటిస్తూ సర్కిళ్లు ఉండాలి
- దుకాణాల యజమానులు... పోలీసులు, కాపలాదారుల సాయం తీసుకోవాలి
ఇదీ చదవండి:
రాష్ట్రంలో మద్యం ధరలు 25 శాతం పెంపు