Liquor Price Hike in Andhra Pradesh: ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఆ తర్వాత దశలవారీగా మద్యంపై నిషేధమంటూ మాట మార్చారు. తీరా చూస్తే.. నాలుగున్నరేళ్లలో లక్షా పదివేల కోట్ల రూపాయలకు పైగా మద్యాన్ని విక్రయించారు. ఇలా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న జగన్ సర్కార్ వారి నుంచి మరింత ఆదాయం పిండుకోవడానికి కొత్త ఎత్తుగడ వేసింది. ఎంఆర్పీ (Maximum Retail Price) ఆధారంగా వివిధ బ్రాండ్లపై ఫిక్స్‌డ్ కాంపొనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని మూలధరపై శాతాల రూపంలో వసూలు చేయనుంది. తదనుగుణంగా వ్యాట్, ఏఈడీని సవరించింది.
దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది. అయితే ఈ సవరణలోనే చిన్న మతలబు ఉంది. కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్ సీసా 10 నుంచి 40 రూపాయల వరకూ, హాఫ్ బాటిల్ 10 నుంచి 50 రూపాయల వరకూ, ఫుల్ బాటిల్ 10 నుంచి 90 రూపాయల వరకూ పెరిగాయి. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలు పెరగగా.. అధికంగా అమ్ముడుపోని, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగానే లభించనుంది. కావాల్సినవారికి సంబంధించిన కొన్ని బ్రాండ్ల విక్రయాల పరిమాణం పెంచేందుకు వాటి ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది.
ఒక్కో కేసు మూలధర 2 వేల 500 రూపాయల లోపు ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్ల మూలధరపై 2 వందల 50 శాతం, మూల ధర 2 వేల 500 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లపై 150 శాతం ఏఆర్‌ఈటీ (Additional Retail Excise Tax) విధించారు. బీరు కేసుపై 225 శాతం ఏఆర్‌ఈటీ విధించారు. వీటన్నింటిపైనా ఏఈడీ, వ్యాట్‌లు చెరో 10 శాతం, స్పెషల్ మార్జిన్ 110 శాతం చొప్పున వసూలు చేయనున్నారు. ఫారిన్ లిక్కర్ కేసుపై 75శాతం ఏఆర్‌ఈటీ విధించారు.