నిరుపయోగంగా ఎత్తిపోతల పథకాలు..సాగునీరు అందక రైతుల అవస్థలు Uplift schemes in joint Guntur district: ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్తపోతల పథకాలుగా మిగిలాయి. నాలుగేళ్లుగా నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పథకాలు పడకేశాయి. ఫలితంగా వేలాది ఎకరాల ఆయుకట్టు వర్షాధారంగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల నిర్వహణపై శీతకన్ను వేయడంతో రైతులు తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.
44 వేల 875 ఎకరాలకు అందని సాగునీరు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 240 ఎత్తిపోతల పథకాల కింద 2లక్షల 47వేల 758 ఎకరాల ఆయుకట్టు ఉంది. ఇందులో 64 ఎత్తిపోతల పథకాలు మరమ్మతుకు గురయ్యాయి. వీటికి మరమ్మతులు చేయనందున 44 వేల 875 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ పథకాలకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు నిధులు వెచ్చించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు కావడం లేదు. గత నాలుగేళ్లుగా ఎత్తిపోతల పథకాలను పట్టించుకునే నాథులే కరవయ్యారు. రైతుల కమిటీల వద్ద అంత పెద్ద మొత్తంలో నిధులు లేక మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో నేతలు అధికారులతో ప్రతిపాదనలు పంపినా స్పందన ఉండటం లేదు.
సాగునీరందించిన పథకాలు నిరుపయోగంగా..నాలుగేళ్లుగా నిధుల కొరత ఉండటంతో ఎత్తిపోతల పథకాలు అధ్వానంగా మారాయి. రాష్ట్రంలో అత్యధిక ఎత్తిపోతల పథకాలు ఉండటంతో పాటు అధిక విస్తీర్ణంలో సాగునీరు అందిస్తున్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాది ప్రథమస్థానం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకు సైతం ఏపీఐడీసీ బిల్లులు మంజూరు చేయకపోవడంతో మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొన్ని నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక కొత్త పథకాల మంజూరుకు ప్రతిపాదనలు వెళ్లడమేకాని నిధులు విడుదల కావడం లేదు. ఒకప్పుడు సాగునీరందించిన పథకాలు.. నేడు నిరుపయోగంగా మారాయి.
వర్షాధారంపై ఆధారపడి పంటలు..పథకాలు ఎక్కడికక్కడే లీకేజీలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పైపులు, మోటార్లు వంటివి చోరీకి గురవుతున్నాయి. కొన్ని రైతు కమిటీలు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి. గతంలో మిర్చి, మొక్కజొన్న ఇతర వాణిజ్య పంటలు పండించే రైతులు ప్రస్తుతం వర్షాధారంపై ఆధారపడి శనగ వంటి ఒకటి, రెండు పంటలే పండిస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని రైతులు చెబుతున్నారు. పథకాలు మరమ్మతులకు గురై వేలాది ఎకరాల పొలాలు వర్షాధారంగా మారిన నేపథ్యంలో ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరమ్మతులకు గురైన పథకాలను ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: