ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మరింతగా ఉద్యమించాలని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం రాష్ట్ర తెలుగు రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సంస్థాగత బలమే తెదేపాకు అండ. రైతు సమస్యలపై తెలుగు రైతు విభాగం రాజీ లేకుండా పోరాడుతోంది. తెదేపా హయాంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో విశాఖ, తిరుపతి, అమరావతి సహా అన్ని జిల్లాల్లో భూముల ధరలు పెరిగి రైతులు లాభపడ్డారు. ఇప్పుడు ధరలు పడిపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. 9 నెలల్లో సీఎం జగన్ నిజస్వరూపం బయటపడింది. పోలీసులను అడ్డు పెట్టుకొని సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారు. భూపంపిణీని కుంభకోణంగా మార్చేశారు. అమరావతిలో భూసమీకరణ తప్పంటూనే విశాఖలో భూసమీకరణ చేస్తానంటారు. పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కుటుంబాలకు క్షోభ పెడుతున్నారు’ అని విమర్శించారు.
గిట్టుబాటు లేక రైతుల కష్టాలు
‘గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం క్వింటా రూ.425 నుంచి రూ.625 తక్కువకు అమ్ముకుంటున్నారు. ధాన్యం బస్తాలతో రెవెన్యూ కార్యాలయాల ముట్టడి, రోడ్లపై పోసి నిప్పు పెట్టడంలాంటివి మా హయాంలో లేవు. ధాన్యం బకాయిలు రూ.2వేల కోట్లు చెల్లించడం లేదు. ఉత్తరాంధ్రలోనే రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ నిలదీస్తాననే ఉత్తరాంధ్ర పర్యటనను అడ్డుకున్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాల వల్లే 9 నెలల్లో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని చంద్రబాబు వివరించారు.