తెలుగుదేశం అంటే డైనమిక్ లీడర్లకు పెట్టింది పేరు. 1983లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దింది ఆ పార్టీ. అయితే పార్టీ దురదృష్టమో మరొకటో కానీ.. అద్భుతతీరిలో ఎదిగిన నేతల్లో చాలా మంది అకాల మరణంపాలయ్యారు. తెలుగుదేశంలో అగ్రనేతగా ఎదిగిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. అనుమానాస్పద మరణంతో.. తెలుగుదేశంలో అర్థంతరంగా రాలిపోయిన నేతలపై చర్చ జరుగుతోంది. నాటి జమ్మలమడుగు శివారెడ్డి నుంచి నేటి కోడెల వరకూ ఈ జాబితా పెద్దగానే ఉంది.
శివారెడ్డితో మొదలు
మాజీమంత్రి, జమ్మలమడుగు తెదేపా నేత గుల్లకుంట్ల శివారెడ్డిని ప్రత్యర్థులు 1993లో హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమం వద్ద హత్య చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రైతు నాయకుడు , మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి.. తన నియోజకవర్గం పొన్నూరు పరిధిలోని చేబ్రోలు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. ఆయన స్థానంలోనే ఆయన కుమారుడు ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు తెలుగుదేశంలో ముఖ్యనేత.. అప్పటి హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి నక్సల్స్ మందుపాతరకు బలయ్యారు. తెలుగుదేశంలో కీలకనేతగా ఎదుగుతున్న తరుణంలో ఆయన అర్థంతరంగా తనువు చాలించారు. ఇక కృష్ణాజిల్లా రాజకీయాల్లో వేగంగా దూసుకొచ్చిన యువకెరటం దేవినేని రమణ. దూకుడైన రాజకీయనేతగా ఉన్న దేవినేని రమణను చంద్రబాబు మొదటి సారి గెలవగానే మంత్రిని చేశారు. మాధవరెడ్డి చనిపోయిన కొన్నాళ్లకే.. రమణ కూడా రైలు ప్రమాదంలో చనిపోయారు. 1999లో గోదావరి ఎక్స్ప్రెస్ వరంగల్ జిల్లాలో పట్టాలు తప్పిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న రమణ చిన్న వయసులోనే కాలం చేశారు. రమణ స్థానంలో దేవినేని ఉమ రాజకీయ ప్రవేశం చేశారు.
పరిటాల రవీంద్ర
రాయలసీమలో తెలుగుదేశం ముఖ్యనేత.. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ పగలకు బలైపోయారు. 2005 జనవరి 24వతేదీన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు.