మంత్రుల ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలన్న వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల ప్రయత్నాన్ని గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లించిందంటూ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. కానీ.. ముందస్తుగా వామపక్ష నాయకుల్ని ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం పక్కదారి పట్టించిన నిధుల్ని తిరిగి సంక్షేమ బోర్డుకు జమ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. 18 నెలలుగా పెండింగ్లో ఉన్న బీమా సొమ్ము చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కోరారు. జిల్లాలో ఏడు కోట్ల రూపాయల క్లెయిమ్స్ పరిష్కరించాలన్నారు. ఇసుకను రాష్ట్ర ఏజెన్సీల ద్వారానే సరఫరా చేయాలని అన్నారు. అర్హులైన కొత్తవారిని సంక్షేమ బోర్డులో నమోదు చేయాలని వామపక్ష నాయకులు కోరారు.