ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన తొలి ప్రభుత్వంగా వైకాపా సర్కారు నిలిచిపోతుందని న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం కూలిపోయే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. అమరావతి రైతులకు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకుడైన న్యాయవాది జడా శ్రావణ్ కుమార్, రాష్ట్ర ముస్లిం లీగ్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్ మంగళవారం సంఘీభావం ప్రకటించారు.
తుళ్లూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెంలో పర్యటించి రైతులకు మద్దతు ప్రకటించారు. శనివారం అరెస్టయిన కృష్ణాయపాలెం రైతుల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. రాజధానిని తరలిస్తే మందడంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ ప్రకటించారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని అమరావతి ఐకాస నాయకుడు సుధాకర్ ఖండించారు.