Film Actor Tarakaratna Last Rites: సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. అంతకుముందు ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నందమూరి బంధు, మిత్రుల అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.
గుండెపోటుకు గురై 23 రోజులుగా బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడంతో.. ఆయన అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తారకరత్న ఆఖరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు భారీగా తరలివచ్చారు.
శనివారం తారకరత్న తుదిశ్వాస వీడగా.. సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహానికి నందమూరి కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు.. తారకరత్నకు నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న వారంతా ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తారకరత్న భౌతిక కాయాన్ని నందమూరి కుటుంబసభ్యులతో బాలకృష్ణ మోశారు.