Illegal soil mining in Guntur district: పేరేమో పేదలది.. కాసులు మాత్రం పెద్దలకు. జగనన్న కాలనీల కోసమని చెప్పి మట్టి తవ్వకాలు. కానీ, తరలించేది మాత్రం ప్రైవేట్ వెంచర్లకు. అడిగేవారు లేరు.. అడ్డుకునే వారు రారనే ధైర్యంతో.. అడ్డగోలు తవ్వకాలతో చెలరేగిపోతున్నారు. భూగర్భ జలాలకు తగిలేంత వరకు బుల్డోజర్లు దింపుతూ భూమాతకు గర్భశోకం పెడుతున్నారు. రాత్రీపగలు అనే తేడా లేకుండా మట్టి తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇలా గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా వ్యాపారం మూడు టిప్పర్లు.. ఆరు లారీలతో విరాజిల్లుతోంది.
యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నేతల మట్టి దందా..ఇక్కడ కనిపిస్తున్నది జగనన్న కాలనీ. గుంటూరుకు 10 కిలోమీటర్ల దూరంలో పేరేచర్ల సమీపంలో ఉంది. ఇక్కడ 18 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. రోడ్లతో పాటు ఎత్తుపల్లాలు సరిచేసేందుకు భారీగా మట్టి అవసరమవుతోంది. ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వేందుకు రెవెన్యూ అధికారులు అనుమతిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు మట్టి దందాకు తెరలేపారు. జగనన్న కాలనీలకు గ్రావెల్ పేరిట అనుమతి తీసుకుని ప్రైవేటు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ‘ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయి పరిశీలనలో.. పేరేచర్ల కొండల్లో జరుగుతున్న మట్టి మాఫియా బాగోతం బయటపడింది.
పోరంబోకు భూముల్లో మట్టి తవ్వకాలు.. గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటు పెదపలకలూరులోనూ పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, చదును చేయడానికి మట్టి కావాలి. టిప్పరు మట్టికి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నారు. గుంటూరుకు పేరేచర్ల కొండలు సమీపంలో ఉండటంతో అనుమతి తీసుకున్న నేతలు.. పోరంబోకు భూముల్లో తవ్వకాలు చేసి మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. మేడికొండూరు, యడ్లపాడు మండలాల సరిహద్దులో మట్టి తవ్వకాలను ఈటీవీ- ఈనాడు- ఈటీవీ భారత్ బృందం చిత్రీకరిస్తుండగా.. టిప్పరు, ప్రొక్లయిన్‌ను అక్కడి నుంచి పంపించేశారు. వాహనాలు జగనన్న కాలనీ వైపు కాకుండా.. నాయుడుపేట వైపు వెళ్లడంతో మట్టి ఇతర ప్రాంతాలకు తరలివెళ్తోందని తేటతెల్లమైంది.