Lack of Funds for Government Schools: ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చెప్పే మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదు అనడానికి ఇదే ఉదాహరణ. గత నెల 18న బాపట్ల విద్యాశాఖ ప్రాంతీయ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిధుల విషయంలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తరువాతే రోజే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలకు బిల్లుల కోసం విద్యుత్ శాఖ లైన్‌మెన్ వెళ్లారు.
పాఠశాల విద్యుత్ బిల్లు కట్టలేదని చెప్పి సరఫరా నిలిపివేయబోగా.. ఉపాధ్యాయులు మంత్రి బిల్లులు చెల్లించవద్దన్న విషయం లైన్‌మెన్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఆసుపత్రి మినహా మిగిలిన ఎక్కడైనా బిల్లులు పెండింగ్ ఉంటే సరఫరా నిలిపివేయమన్నారని లైన్‌మెన్ తెలిపారు. పాఠశాలకు విద్యుత్ నిలిపేస్తే విద్యార్థులకు,తరగతుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయుులు బతిమిలాడినా.. తానేం చేయలేని లైన్‌మెన్ తేల్చిచెప్పడంతో అప్పటికప్పుడు బిల్లులో సగం డబ్బుల్ని ప్రధానోపాధ్యాయుడు తన జేబులో నుంచి తీసి చెల్లించక తప్పలేదు.
Students fire on NADU-NEDU: ప్రారంభమైన సర్కారీ బడులు..నత్తనడకన నాడు-నేడు పనులు..
ప్రధానోపాధ్యాయులే బిల్లులు చెల్లింపు.. గతంతో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరిగిందని, పాఠశాల వ్యవహారాలన్నీకరెంటుతోనే ముడిపడి ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌లో డిజిటల్ విద్యా బోధన చేయాలంటే విద్యుత్ తప్పనిసరి. మధ్యాహ్న భోజనం తయారీకి అవసరమైన నీళ్లకు, ప్యూర్‌ఫైడ్ వాటర్ యూనిట్లకు కరెంట్ కావాలి. టీచర్లు, విద్యార్థుల హాజరు, టాయిలెట్స్ ఫొటోలు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు కంప్యూటర్ల ద్వారా పంపాలంటే విద్యుత్ ఉండాల్సిందేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపుల గురించి మంత్రి హామీ ఇచ్చినా రాతపూర్వక, స్పష్టమైన ఉత్తర్వులేవీ వెలువడకపోవడంతో ప్రధానోపాధ్యాయులే బిల్లులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు.