ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి.. - ఏపీ లేటెస్ట్ న్యూస్

Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీల్లో మేం కట్టేది "ఇళ్లు కాదు.. ఊళ్లు "అంటూ సీఎం జగన్‌, ఆయన పార్టీ నేతలు ఊదరగొట్టే మాటలు విని.. మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఆ మాటలు చెప్పేది సీఎం జగన్‌.. ఆయన చెప్పే దానికి చేసే దానికి అసలు పొంతనే ఉండదని ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో విషయాల్లో రుజువైంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జగనన్న కాలనీల సంగతి పక్కన పెట్టి.. ఆయన ప్రభుత్వం ఇటీవల సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన లేఅవుట్లను మాత్రమే తీసుకుందాం.. వాటిలో ఒక్క చోటా సిమెంటు రోడ్డూ కనిపించదు. మురుగు కాల్వల మాటే వినిపించదు. తాగునీటి ట్యాంకులు ఉండనే ఉండవు . ఒక్కటంటే ఒక్క లేఅవుట్‌లోనూ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పినట్లుగా వసతులు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది.

Lack_of_Facilities_in_Jagananna_Colonies
Lack_of_Facilities_in_Jagananna_Colonies

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 7:20 AM IST

Updated : Oct 21, 2023, 1:30 PM IST

Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి..

Lack of Facilities in Jagananna Colonies: గుంటూరు జిల్లా పేరేచర్లలో జగనన్న కాలనీ ప్రారంభం రోజున హడావుడిగా కంకర రాళ్లు తోలి రోడ్డు వేశారు. ఎవరి ఇంటిముందు వారు గుంత తవ్వుకుని మురుగు అందులోకి వదులుకోవాల్సిందే. తాగునీటి ట్యాంకు నిర్మించలేదు. రెండు బోర్లు వేశారంతే.. ఇటీవలే ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జగనన్న కాలనీని ఆదరాబాదరాగా ప్రారంభించారు. ఇక్కడ 160 ఇళ్లు మంజూరు అయితే.. పూర్తయినవి లేదా ఆర్‌సీ స్థాయిలో ఉన్నవి 54 మాత్రమే. డ్రెయిన్లు, సిమెంటు రోడ్లు నిర్మించలేదు.

బోరు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మించలేదు. కాలనీలో మురుగునీరు వెళ్లే మార్గం కన్పించడం లేదు. విద్యుత్ స్తంభాలు, వైర్లు వేశారేగాని చాలా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. వీధి దీపాలు పూర్తిగా వెలగడం లేదు. పేదలకు, కూలీలకు ఇళ్ల నిర్మాణం మోయలేని భారంగా మారింది.

Worst Condition in Jagananna Colonies: చెరువుల్లా జగనన్న కాలనీలు.. జనసైనికుల పడవ ప్రయాణం

కృష్ణా జిల్లా బందరు మండలం మేకావానిపాలెం పంచాయతీతో పాటు పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్‌కు చెందిన 165 మందికి మేకావారితోట లేవుట్‌లో సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మొత్తం 78 గృహ ప్రవేశాలు జరిగాయి కాలనీ మొత్తం మీద రెండు ప్రధాన రహదారులు సీసీ రోడ్‌లుగా వేయాల్సి ఉంది. ఆ పనులు చేపట్టలేదు. అంతర్గత డ్రెయిన్లు నిర్మించలేదు. ఇంకుడుగుంతలు రహదారుల మార్జిన్లలోనే ఉండటం వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు జగనన్న కాలనీలో మంజూరైన గృహాలు 260 కాగా.. పూర్తయినవి లేదంటే ఆర్‌సీ స్థాయిలో ఉన్నవి 89. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయటంతో.. కొందరు లబ్ధిదారులు ఇళ్లలో చేరిపోయారు. కానీ పైపులైను పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ గృహప్రవేశాల రోజు తర్వాత కుళాయిల ద్వారా నీటి సరఫరాని నిలిపేశారు. ఆ తర్వాత రోజు నీరు అడిగితే పైపులైన్‌ పనులన్నీ పూర్తయిన తర్వాత విడుదల చేస్తామన్నారు. మురుగు కాల్వలు లేక ఇళ్లలోంచి వచ్చిన నీరు రోడ్డుపక్కనే నిలిచి దుర్వాసన వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో ఇళ్ల సముదాయాన్నిమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. మొత్తం 420 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి.. 82ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే నీరు బయటకు పోయేపరిస్థితిలేదు. ఎలాంటి వసతులూ కల్పించకుండానే ప్రారంభించేశారని విపక్ష నాయకులు మండిపడుతున్నారు.

Floods In Jagananna Colonies: నీట మునిగిన జగనన్న కాలనీలు.. చెరువుల కన్నా దారుణం.

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట పంచాయితీ లింగాల వలసలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించగా.. 71 ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయి. 112 మందికి ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించగా.. 27 ఇల్లు నిర్మాణంలో ఉండగా మిగిలినవి పునాది దశలోనే నిలిచిపోయాయి, ఈ కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేకున్నా హడావడిగా ఇళ్లకు వైసీపీ రంగులు వేసి గృహప్రవేశాలు చేయించేశారు. తాత్కాలికంగా ఇంకుడు గుంతలు తవ్వించి మమా అనిపించారు.కాలనీ మొత్తం మట్టి రోడ్లు కావడంతో చినుకు పడితే బురద మయంగా మారుతోందని కాలనీవాసులు అంటున్నారు.

విజయనగరంజిల్లా బొబ్బిలి ఐటీఐకాలనీలో జిల్లాస్థాయి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు 394 ఇళ్లు మంజూరు కాగా.. 100మంది వరకు ఇళ్లలో చేరిపోయారు. అయితే.. పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యం, అంతర్గత రోడ్లు, విద్యుత్తు లైన్లు వేయలేదు. వసతుల లేమిపై స్థానికులతో పాటు ప్రతిపక్ష నాయకులుమండిపడుతున్నారు.

పార్వతీపురం మన్యంజిల్లా కృష్ణపల్లిలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఇక్కడ 124మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా 20 ఇళ్లే పూర్తయ్యాయి. ఏడుగురు మాత్రమే గృహ ప్రవేశాలు చేశారు. సదుపాయల విషయానికొస్తే., శూన్యం అని చెప్పొచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఐదు జగనన్న కాలనీలుండగా, వీటిలో మూడు చోట్ల లబ్దిదారులు నిర్మాణాలు చేస్తున్నారు. రెండు చోట్ల పునాదులు నిలబడవని భావించిన లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు రావటంలేదు. రాప్తాడు ఎమ్మెల్యేకు చెందిన గుత్తేదారు సంస్థ అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు.

Jagananna Colonies జగనన్న కాలనీలా! చెరువులా!.. ఇల్లు నిర్మించాక పరిస్థితి ఏంటంటున్నలబ్ధిదారులు

ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా గృహప్రవేశాలు చేయించిన కాకినాడ జిల్లా సామర్లకోట ఈటీసీ సెంటర్, ప్రత్తిపాడు రోడ్డు లేఅవుట్‌లోనూ శాశ్వత ప్రతిపాదికన సిమెంటు రహదారులు, మురుగుకాల్వలు ఏర్పాటు చేయలేదు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకుడుగుంతలు, మెటల్‌ రోడ్లతో సరిపెట్టారు. మంత్రి రోజా గృహ ప్రవేశాలు చేయించిన తిరుపతి జిల్లా వడమాళ్లపేట మండలం కాయం లేఅవుట్‌లో రహదారులన్నీ గుంతల మయంగా ఉన్నాయి.

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు లేఅవుట్‌లో ఇళ్ల ముందు మురుగునీరు పారుతోంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పరిధిలోని గూబనపల్లి లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణ పూర్తికాకుండానే వైసీపీ రంగులు వేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సోమేశ్వరం కాలనీలో పక్కా డ్రైనేజీలు లేక లబ్ధిదారులు గొట్టాలతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెం లేఅవుట్‌లో అంతర్గత రహదారులపై సన్నని గుల్లపోసి వదిలేశారు.

ఇళ్ల ముందు గుంతలు తీసుకుని మురుగునీరు అందులో పడేలా ఏర్పాటు చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం కాలనీలో మురుగు నీరు ఇళ్ల ముంగిటే వదులుకోవాల్సి దుస్థితి. పరవాడ-1 కాలనీలో సిమెంటు రహదారి ఊసే లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెలోని జగనన్న కాలనీ ఇళ్లకు వైకాపా రంగులేశారుగానీ వాటి ముందు రోడ్డు మాత్రం వేయలేదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల జగనన్న లేఅవుట్‌ కాలనీలో మట్టిరోడ్డే ఉంది.

కాలనీల్లో మౌలిక వసతులపై అంతగా దృష్టి పెట్టని జగన్‌.. ప్రచారాన్ని పొందేందుకు ఖర్చు చేయడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. గృహప్రవేశాలు నిర్వహించిన ప్రతి కాలనీ ముందు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇందుకు 5 నుంచి 6 లక్షలు ఖర్చు చేశారు. వీటి కోసం సుమారు 1.30 కోట్లు వెచ్చించారు.

Jagananna Colonies చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు.. ముంపు ప్రాంతాల్లో ఇళ్లపై ఆందోళన

Last Updated : Oct 21, 2023, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details