ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో విషాదం.. మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి - గుంటూరు వార్తలు

laborers strucked under mud:
మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో కూలీలు మృతి

By

Published : Mar 16, 2022, 11:35 AM IST

Updated : Mar 16, 2022, 10:53 PM IST

11:34 March 16

భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఘటన.. కేసు నమోదు చేసిన అరండల్‌పేట పోలీసులు

మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో కూలీలు మృతి

Laborers trapped under the mud: పొట్టకూటికోసం ఇతర రాష్ట్రాల నుంచి ఊరుగాని ఊరు వచ్చిన వలస కూలీల బతుకులు మట్టిపెళ్లల కింద నలిగిపోయాయి. కూలీ పనులు చేస్తూ.. జీవనం సాగిస్తున్న వారిపై మృత్యువు మట్టిపెళ్లల రూపంలో విరుచుకుపడింది. బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం పునాదుల తవ్వుతుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డినగర్‌లో జరిగింది. అయితే ఈఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు అరండల్‌పేట పోలీసులు తెలిపారు.

ముత్యాలనగర్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం కోసం సుమారు 40 అడుగుల మేర పునాది తవ్వారు. దానికి అనుబంధంగా కాంక్రీట్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వాళ్లలోని కొందరూ.. మట్టిపెళ్లలు విరిగిపడటాన్ని గమనించి బయటకు పరుగులు తీయగా.. ఇద్దరు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. సంఘటన జరిగిన వెంటనే జేసీబీ సాయంతో సహాయ చర్యలు చేపట్టగా.. ఇద్దరు కూలీలు మృతిచెందారు. మృతులు ఇద్దరు మజ్బుల్‌ (బిహార్‌), మజ్ను‍‌ (బెంగాల్)గా గుర్తించారు.

ప్రమాదం సమయంలో అక్కడ ఆరుగురు పనిచేస్తుండగా.. ఇద్దరు చనిపోయారు. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న అమీన్(బంగాల్‌).. ​గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

హెచ్చరించిన గుత్తేదారు పట్టించుకోలేదు
రక్షణ చర్యలు చేపట్టలేదని.. ప్రమాదం జరుగుతుందని తాము హెచ్చరించినా గుత్తేదారు పట్టించుకోలేదని కూలీలు కన్నీటిపర్యంతమయ్యారు.

అనుమతి లేకుండానే భవన నిర్మాణం: కమిషనర్‌
మరోవైపు ఈ ఘటనపై గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్‌ స్పందించారు. జీ ప్లస్‌ 6 భవన నిర్మాణానికి దరఖాస్తు చేశారని.. ప్లానింగ్‌లో లోపాలు ఉండటంతో అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. లోపాలు సరిచేసే వరకు పనులు ఆపాలని యాజమాన్యానికి సూచించామన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశామని.. గాయపడిన ముగ్గురికి ప్రాణాపాయం లేదని నిశాంత్‌కుమార్‌ తెలిపారు.

కార్పొరేషన్‌ అనుమతివ్వలేదు: మేయర్‌ మనోహర్‌ నాయుడు
కార్పొరేషన్‌ అనుమతి లేకుండా సెల్లార్‌ నిర్మాణానికి పనులు చేపట్టారని గుంటూరు మేయర్‌ మనోహర్‌నాయుడు అన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఘటన దురదృష్టకరమని చెప్పారు. దీనికి బాధ్యులైన యాజమాన్యం, అధికారులను ఉపేక్షించేది లేదని.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: సీఐటీయూ
మట్టిపెళ్లలు పడి చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్​ చేసింది. ఈమేరకు గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నేతులు ధర్నా చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఘటనపై కేసు నమోదు..
ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు అరండల్​పేట పోలీసులు తెలిపారు. అధికారుల ఫిర్యాదుతో పురపాలక చట్టం, మైనింగ్ కార్పొరేషన్ చట్టాల కింద స్థలం యజమాని, బిల్డర్, లైసెన్స్‌డ్‌ పర్సనల్, స్ట్రక్చరల్ ఇంజినీర్‌పై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Spurious Liquor Deaths: జంగారెడ్డిగూడెంలో 19కి చేరిన నాటుసారా మృతుల సంఖ్య

Last Updated : Mar 16, 2022, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details