ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధికే పట్టం.. భాజపాకు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కేటీఆర్ - KTR ON MUNUGODE BYPOLL WINNING

KTR ON MUNUGODE BYPOLL VICTORY : అభివృద్ధికి, ఆత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాజగోపాల్‌రెడ్డి వెనక మోదీ, అమిత్‌షా ఉన్నారని ఆరోపించిన కేటీఆర్‌.. దిల్లీ నుంచి వందల కోట్ల డబ్బు సంచులు తెచ్చి ఓటర్లను కొనే ప్రయత్నం చేశారని విమర్శించారు.

KTR ON MUNUGODE BYPOLL VICTORY
KTR ON MUNUGODE BYPOLL VICTORY

By

Published : Nov 6, 2022, 7:41 PM IST

KTR ON MUNUGODE BYPOLL WINNING : అభివృద్ధికి, అత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టంకట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మునుగోడులో తెరాస విజయం సాధించిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసినందుకు సంతోషంగా ఉందన్నారు.

అభివృద్ధికే పట్టం.. భాజపాకు ఇది చెంప పెట్టులాంటి తీర్పు

‘‘కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు. విజయం కోసం పనిచేసిన తెరాస కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు. గొప్పగా పనిచేసి కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఇతర నాయకులకు అభినందనలు. నల్గొండ జిల్లాలో 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన 3 ఉప ఎన్నికల్లో తెరాసకు పట్టంకట్టిన జిల్లా ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని పెద్దలు చెబుతుంటారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దింది నరేంద్రమోదీ, అమిత్‌ షా. వారికి ఓటర్లు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు.'' - మంత్రి కేటీఆర్

అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి కావొచ్చు.. కానీ, వెనుక ఉండి నడిపించింది మోదీ, అమిత్‌ షా అని ఆరోపించారు. మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుకు వారికి చెక్కర్‌ వచ్చిందని ఎద్దేవ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చాలని రాజకీయ క్రీడకు భాజపా తెరలేపిందన్నారు. తెరాస అభ్యర్థికి ఇంకా మెజార్టీ రావాల్సి ఉంది.. కానీ, భాజపా రూ.వందల కోట్లు ఖర్చు పెట్టిందని అభిప్రాయపడ్డారు.

''డబ్బు, అధికార మదంతో మునుగోడు ప్రజలను కొనాలని చూశారు. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే రూ.కోటితో దొరికింది భాజపా కార్పొరేటర్‌. ఈటల రాజేందర్‌ అనుచరుడు కడారి శ్రీనివాస్‌ రూ.90లక్షలతో దొరికింది నిజం కాదా. డాక్టర్‌ వివేక్‌.. గుజరాత్‌ నుంచి రూ.2.5కోట్లు హవాలా ద్వారా తెప్పించింది నిజం కాదా? వివేక్‌ కంపెనీ నుంచి రూ.75కోట్లు రాజగోపాల్‌రెడ్డి కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ చేసింది వివేక్‌ కాదా? రాజగోపాల్‌రెడ్డి కంపెనీ సుశీ ఇన్‌ఫ్రా నుంచి మనుగోడు ప్రజల ఖాతాల్లోకి రూ.5.25 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా చేశారు.'' - మంత్రి కేటీఆర్

15 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బృందాలను, 40 ఐటీ టీమ్‌లను మునుగోడు కోసం రంగంలోకి దించారని మంత్రి ఆరోపించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ నివాసంలో డబ్బులు దొరికాయని అసత్య ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెరాస మెజార్టీని తగ్గించగలిగారు కానీ, గెలుపును అడ్డుకోలేక పోయారని విమర్శించారు. ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ, మునుగోడు ఉప ఎన్నిక మాత్రమే ఎందుకు ధనమయమైందో ప్రజలు ఆలోచించాలని సూచించారు.

''ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం చేస్తోంది భాజపా కాదా? రూ.వందల కోట్లు ఇచ్చి ఎన్నికల్లో ఎలాగైనా గెలవండని అడ్డదారులు తొక్కుతున్నది భాజపా కాదా? అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు, 40 ఐటీ టీమ్‌లు మునుగోడులో ఉండగానే అక్రమాలు జరిగాయా? తెరాస మహిళా ఓటర్ల చేతులపై గోరింటాకుతో కమలం పువ్వు గుర్తు వేసి చిల్లర రాజకీయాలు చేశారు. ఓటమిని హుందాగా ఒప్పుకునే ధైర్యం భాజపా నేతలకు ఉండాలి. కారును పోలిన గుర్తులకు 6వేల ఓట్లు పోలయ్యాయి.

ఈవీఎంలను మేనేజ్‌ చేస్తామని దీల్లి నుంచి వచ్చిన బ్రోకర్లు కూడా చెబుతున్నారు. గెలుపోటములను హుందాగా స్వీకరించే స్థిత ప్రజ్ఞత తెరాసకు ఉంది. మా పార్టీని పోలిన గుర్తులు తెచ్చినా మేం ఎక్కడా ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించలేదు. పలివెలలో పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై దాడి చేశారు. 12మంది తెరాస కార్యకర్తల రక్తం కళ్లచూశారు. సానుభూతి కోసం ఈటల రాజేందర్‌ ప్రెస్‌మీట్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ బండి సంజయ్‌ అర్ధరాత్రి వేసిన నాటకాలను ప్రజలు పట్టించుకోలేదు. కర్రు కాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజల చైతన్యానికి ధన్యవాదాలు. మునుగోడులో తెరాసకు గతంలో 34.29 శాతం ఓట్లు వస్తే.. ఈసారి 43శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో కంటే 9శాతం ఓట్లు పెరిగాయి’’ అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details