మహిళలు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు.. కానీ చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్... మహిళా జర్నలిస్టులకు సూచనలు చేశారు.
ప్రభుత్వం తరఫున సత్కారం అందుకున్న మహిళలకు అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా అంతే. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారు.. అని పేర్కొన్నారు.
మహిళా కెమెరామెన్, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవని మంత్రి వెల్లడించారు. మహిళల కోసం వీహబ్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అందుబాటులోకి తెస్తున్నారని తెలిపారు. మీడియా రిలేటెడ్ స్టార్టప్ పనులు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుందని వివరించారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు చీల్చి చెండాడండని సూచించారు. దాంతో పాటు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయండని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
మాతా శిశుమరణాలు తగ్గాయి, నిమ్స్‌లో అత్యధిక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశామని తెలిపారు.. తమ తప్పులు ఎంత కవర్ చేస్తారో.. పాజిటివ్ న్యూస్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వండని సూచించారు. దుర్ఘటనలు జరిగినప్పుడు తమకు బాధ్యత లేదన్నట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్‌గా ఏర్పడాలని చెప్పారు. తమ సమస్యలను ఐఅండ్‌పీఆర్ శాఖకు తెలపాలని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మహిళా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం మా తప్పులను ఎంత కవర్ చేస్తారో... పాజిటివ్ న్యూస్ కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వండి. దుర్ఘటనలు జరిగినప్పుడు మాకు బాధ్యత లేదనట్టు మాట్లాడటం సరికాదు. చిన్నతనం నుంచే మగ పిల్లలకు ఆడవారితో ఎలా మెలగాలో నేర్పాలి. పాఠశాల దశలోనే సెక్స్ ఎడ్యుకేషన్ వంటి వాటిని నేర్పాలి. వీహబ్ లాంటి వాటిని వినియోగించుకుని కొత్తగా మీడియాలోకి రావలనుకునే వారికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతున్నాం. సీనియర్ జర్నలిస్ట్లుగా మీరు ఎదుర్కొన్న సవాళ్లు సమస్యలను కొత్త వారికి వివరించి తర్ఫీదు ఇవ్వాలని కోరుతున్నాం. - కేటీఆర్, మంత్రి
ఈ కార్యక్రమంలో ఈటీవీ నుంచి మహిళా జర్నలిస్ట్ అవార్డ్‌లను రాణి, షాహిన్, స్వప్న ప్రియ అందుకున్నారు. ఈనాడు నుంచి శ్రీ సత్యవాణి, అనూష నీరుకొండ, దాయన పద్మశ్రీ, చెరుకూరి శాంతిశ్రీ, పాలడుగు పద్మజ, తుమ్మల నాగిని అవార్డులను అందుకున్నారు.
ఇవీ చూడండి: