ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జులై తొలి వారంలో పశ్చిమ డెల్టాకు నీటి విడుదల - జులై తొలి వారంలో పశ్చిమ డెల్టాకు సాగునీరు

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయడానికి జలవనరులశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై తొలి వారంలో నీటిని విడుదల చేయనున్నారు. కాగా నేటి నుంచి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయనున్నారు.

జులై తొలి వారంలో పశ్చిమ డెల్టాకు సాగునీరు
జులై తొలి వారంలో పశ్చిమ డెల్టాకు సాగునీరు

By

Published : Jun 26, 2020, 6:52 PM IST

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆయకట్టుకు జులై తొలి వారంలో సాగునీరు ఇవ్వడానికి జలవనరులశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జులై నెలలో నార్లు పోసుకుని నాట్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు అనుగుణంగా నీటి విడుదలకు జలవనరులశాఖ ప్రణాళిక రూపొందించింది. కృష్ణానదికి వరదలు వచ్చి బ్యారేజీకి నీరు చేరేటప్పటికీ ఆలస్యమవుతుందని గుర్తించిన జలవనరులశాఖ గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తున్నారు. బ్యారేజీకి వచ్చిన నీటిని ప్రస్తుతం కృష్ణా తూర్పు డెల్టాకు విడుదల చేస్తున్నారు. గోదావరి నదిలోనూ రోజువారీగా సగటున 20వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం లేకపోవడంతో పట్టిసీమ పంపులను పూర్తిస్థాయిలో వాడుకొనే పరిస్థితి లేదు గోదావరి డెల్టాకు 15వేల క్యూసెక్కుల వరకు నీటిని తీసుకుంటున్నారు. మిగిలిన నీటిలో పట్టిసీమ ద్వారా సగటున 4500 క్యూసెక్కులు పంపు చేస్తున్నారు.

గోదావరిలో నీటి ప్రవాహం పెరిగితే పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఉన్న 24 పంపులు వినియోగించి 8వేల క్యూసెక్కులకుపైగా నీటిని పంపింగ్‌ చేసుకోవచ్ఛు గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తిస్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రవాహం ఆశించినంతగా లేదు. జులై తొలి వారానికి గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుందన్న అంచనాతో జలవనరులశాఖ కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగునీటి విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని కృష్ణా తూర్పు డెల్టాలో సాగునీటి అవసరాలకు విడుదల చేస్తుండగా మిగిలిన నీటిని పశ్చిమ డెల్టాలో తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. శుక్రవారం 700 క్యూసెక్కులు పశ్చిమ డెల్టా కాలువలకు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి.

5.98 లక్షల ఆయకట్టుకు సాగునీరు

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5.71 లక్షల ఎకరాలు, గుంటూరు వాహిని కింద 27వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో సముద్రతీర ప్రాంతంలో కొంత భూభాగం ఆక్వా చెరువులుగా రూపాంతరం చెందింది. ఆక్వా చెరువులకు సైతం డెల్టా కాలువల నుంచి వచ్చే నీటిని వినియోగిస్తున్నారు. ఏటా జూన్‌ నెలాఖరులో లేదా జులై తొలి వారంలో పశ్చిమడెల్టాకు సాగునీరు అందిస్తున్నారు. తూర్పు డెల్టాకు సాగునీరు ఇచ్చిన 15రోజుల తర్వాత పశ్చిమ డెల్టాకు ఇస్తారు. దీనివల్ల తూర్పు డెల్టా వాళ్లు నాట్లు వేసుకున్న తర్వాత పశ్చిమ డెల్టాలో నాట్లు వేసుకుంటారు. ఈ సమయంలో ఎక్కువగా నీరు అవసరమవుతున్నందున ఈమేరకు నీటి ప్రణాళికను అమలుచేస్తున్నారు.

పశ్చిమ డెల్టాలో సైతం తెనాలి డివిజన్‌తో నాట్లు వేయడం ప్రారంభించి వరుసగా చివరి ఆయకట్టు వరకు విడతల వారీగా నాట్లు వేస్తారు. జిల్లాలో నాట్లు పూర్తయ్యే క్రమంలో ప్రకాశం జిల్లాలో నాట్లు మొదలవుతాయి. దీనివల్ల అందరి అవసరాలకు అనుగుణంగా నీటిని వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. అదేవిధంగా తీర ప్రాంతంలో ఆక్వా చెరువులకు సైతం అవసరమైనప్పుడు నీటిని విడుదల చేస్తారు. అయితే సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే ఆక్వా చెరువులకు నీటిని విడుదల చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details