ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరవన్నది ఎరుగని ప్రాంతంలో ఎండిపోతున్న పంటలు - ఆందోళనలో రైతన్న - ఎండిపోతున్న పంటలు

Krishna Delta Region Faces Drought: గతంలో కరవు అన్నది ఎరగని ప్రాంతం నేడు కరువుతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ప్రభుత్వం వైఫల్యం వల్లే కరవును చవిచూడని కృష్ణా డెల్టాలో పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించుకున్న పంటలు ఇలా చివరి దశలో ఎండిపోవడంతో .. రైతన్నలు ఆందోళనకు గురవతున్నారు. ఈ డెల్టా ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అంటున్నారు.

krishna_delta_region_faces_drought
krishna_delta_region_faces_drought

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:20 AM IST

కరవన్నది ఎరుగని ప్రాంతంలో ఎండిపోతున్న పంటలు - ఆందోళనలో రైతన్న

Krishna Delta Region Faces Drought:గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి కృష్ణా డెల్టా దెబ్బతింది. పొట్ట దశలో నీరు లేక వేల హెక్టార్లలో వరి పొలాలు ఎండిపోయాయి. కోట్ల విలువైన పంటను రైతులు నష్టపోయారు. కారణం వర్షాభావమే అనుకుంటే పొరపాటే. వైసీపీ ప్రభుత్వ ముందుచూపు లేమి.. ప్రాజెక్టుల నిర్మాణంపై తీవ్ర అలక్ష్యమే కారణం. వందల టీఎంసీల వరద వృథాగా సముద్రంలో కలుస్తున్నా వాటిని ఒడిసి పట్టడంలో ప్రభుత్వ వైఫల్యం చెందింది.

ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువన.. టీడీపీ ప్రభుత్వం వైకుంఠపురం, చోడవరం బ్యారేజీలు నిర్మించే ప్రయత్నం చేయగా.. ఈ నిర్మాణ ప్రతిపాదనలను వైసీపీ సర్కారు అటకెక్కించింది. వృథా జలాల సంరక్షణకు చర్యలు తీసుకుని ఉంటే తమకీ దుస్ధితి వచ్చేది కాదని రైతులు వాపోతున్నారు.

కరవు తీవ్రతను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం : తులసిరెడ్డి

కరవును చవిచూసేందుకు కారణం ప్రభుత్వమే: ఎటు చూసినా నెర్రెలిచ్చిన పంట పొలాలు.. నీరు లేక ఒట్టిపోయిన కాలువలు.. నిట్ట నిలువునా ఎండిన పంటలు.. దిగాలుగా నేలకొరిగిన రైతన్నలు ఇదీ ఈ ఏడాది కృష్ణా డెల్టా దుస్ధితి. కరవు అనే మాట ఎరుగని డెల్టాకు ఈ పరిస్ధితి వచ్చేందుకు కారణం ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే.

కరవును జయించేందుకు గత ప్రభుత్వ ప్రణాళిక: అన్నపూర్ణగా పేరొందిన కృష్ణా డెల్టా పరిరక్షణ కోసం గత ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన బ్యారేజీలు నిర్మించాలని ప్రతిపాదించింది. వృథాగా సముద్రంలో కలిసే వరద జలాలను పూర్తి స్ధాయిలో వాడుకునే హక్కు రాష్ట్రానికి ఉండటంతో.. వీటిని ఒడిసిపట్టి కృష్ణా డెల్టాలో దిగువ ప్రాంతాలకు నీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది.

కరవు తాండవం.. పట్టించుకోని పాలకులు.. వలసలే దిక్కు అంటున్న రైతులు

ప్రకాశం బ్యారేజీ ఎగువన 7టీఎంసీల నిల్వ సామర్థ్యంతో వైకుంఠపురం బ్యారేజీ.. ప్రకాశం బ్యారేజీకి 16 కి. మీ దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం వద్ద 4.13 టీఎంసీలతో బ్యారేజీని.. అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి వద్ద మరో బ్యారేజీ నిర్మించి నీటిని నిల్వ చేయాలని నిర్ణయించింది. అవసరమైన చోట్ల రబ్బరు చెక్ డ్యాముల ద్వారా నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచి.. మెట్ట ప్రాంతాలనూ రక్షించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది. బ్యారేజీల నిర్మాణాన్ని ప్రారంభించే లోగా.. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం జరిగిపోయాయి.

రైతు ప్రయోజనాలను పక్కన పెట్టిన వైసీపీ: రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్మాణాలను కొనసాగించాల్సిన వైసీపీ సర్కారు, ఆ ప్రతిపాదనలను అటకెక్కించింది. గత ప్రభుత్వానికి పేరొస్తుందన్న కారణంతో పాటు నదిలో ఇసుక తవ్వకాలు, దందాలు చేసుకునే అవకాశం ఉండడంతో వీటిని పక్కన పెట్టేసింది. ఈసారి సరిపడా నీరు వచ్చినా.. నిలుపుకోలేని పరిస్ధితుల్లో ఇలా కృష్ణా డెల్టా పరిధిలో దివిసీమలోని, నాగాయలంక,అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని వేలాది ఎకరాలు సాగునీరు లేక నిట్టనిలువునా ఎండిపోయాయి.

ఒక్క మండలాన్నీ కరవు జాబితాలో చేర్చని వైసీపీ ప్రభుత్వం - సర్కారు తీరుపై మండిపడుతున్న రైతు సంఘాలు

నీరంతా వృథగా సముద్రంలోకి: ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద వచ్చినా, రాకపోయినా ప్రకాశం బ్యారేజీకి మాత్రం ఏటా వరద వస్త్తోంది. కృష్ణాకు ఉపనదులైన మూసీ,పాలేరు, మన్నేరు వల్ల ఏటా వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో కేవలం 3 టీఎంసీల నీరు నిల్వకే అవకాశం ఉంది. దీనివల్ల మిగిలిన నీరంతా వృథాగా సముద్రంలోకి వెళ్తోంది.

ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు వరకు 100 టీఎంసీలకు పైగా జలాలు బ్యారేజీ నుంచి సముద్రానికి పోయాయి. గతేడాది 496 టీఎంసీలు, 2021-22 లో 501 టీఎంసీలు, 2020-21లో 1,278 టీఎంసీల నీళ్లు సముద్రానికి వృథాగా పోయాయి. 2019-20కి ముందూ ఇదే పరిస్ధితి. నీరు వృథాగా పోతున్నా.. వాటిని నిలిపే ఏర్పాట్లు లేకపోవడం, పక్కనే ఉన్న పంటలు ఎండిపోవడాన్ని తట్టుకోలేని రైతన్నల ఆందోళనలతో.. నదిపై బ్యారేజీలు నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన దేవినేని ఉమ - గోదావరికి పూజలు

అడుగంటిన భూగర్భ జలాలు: వైసీపీ వచ్చాక బ్యారేజీలు కార్యరూపం దాల్చక పోగా, ప్రతిపాదనలు అటకెక్కించింది. దీనివల్ల దివిసీమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటాయి. సముద్రపు నీరు 60కిలోమీటర్ల మేర విజయవాడ వైపు చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా భూగర్భజలాలూ ఉప్పగా మారాయి. బోర్ల నుంచి వచ్చే నీరు సాగు, తాగు నీటికి పనికిరాకుండా పోయాయి. ఉప్పు నీటి వల్ల పంటలు వదలేయడంతో వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. వేసవిలో నీటి కటకట ఏర్పడి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

కృష్ణా నది ఎగువ, దిగువన ప్రతిపాదించిన 3 ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగకపోవడానికి వైసీపీ సర్కారు నిర్లక్ష్యమే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలవరం కట్టకపోగా బ్యారేజీల నిర్మాణాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని మండిపడుతున్నారు. సర్కారు తీరు వల్లే రైతుల పొలాలు నెర్రెలు బారి డెల్టా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన బ్యారేజీలను నిర్మించి వృథాగా సముద్రంలో కలిసే జలాలను మళ్లించి కృష్ణా డెల్టాను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కరవు మండలాల ప్రకటనపై వివక్షను నిరసిస్తూ భగ్గుమన్న రైతన్న - ఆందోళన ఉద్ధృతం, ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు

ABOUT THE AUTHOR

...view details