KR Surya Narayana Anticipatory Bail Petition Updates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపుగానే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. గతంలో రెండు కమిటీలు ఈ అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయని.. ఆ నివేదికల్లో పిటిషనర్ పేరు లేదని కోర్టుకు తెలిపారు. ఉద్యోగుల జీతాల చెల్లింపుపై గవర్నర్‌ను కలిసిన తర్వాతే కేసు నమోదు చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి(ఈ నెల 13) వాయిదా వేసింది. రేపు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.
విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి జులై 7లోపు నిర్ణయం వెల్లడించాలని అనిశా కోర్టును జూన్ 28న హైకోర్టు ఆదేశించింది. అనిశా కోర్టు నిర్ణయం వరకు సూర్యనారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. సూర్యనారాయణ గతంలో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు విచారణ పరిధి లేదంటూనే కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని తప్పుపట్టింది. బెయిలు పిటిషన్ను కొట్టేస్తూ జూన్ 15న ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. బెయిలు పిటిషన్ను.. అనిశా కోర్టుకు బదిలీ చేయాలని 12వ అదనపు జిల్లా కోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.