ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?' - komatareddy venkat reddy Latest Comments

Komatareddy Venkat Reddy: ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే పీఏసీ, పీఈసీల్లో ప్రజా ప్రతినిధులకు చోటు కల్పించిన అధిష్ఠానం.. ఆ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు కోమటిరెడ్డిని ప్రశ్నించగా.. ‘‘మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Komatareddy Venkat Reddy
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

By

Published : Dec 11, 2022, 5:21 PM IST

Komatareddy Venkat Reddy: సిరిసిల్ల, గజ్వేల్‌ తరహాలో నల్గొండలో ఎందుకు 20వేల ఇళ్లు కట్టేలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్గొండ పట్టణంలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాలుగేళ్ల కింద దత్తత తీసుకున్న నల్గొండ నియోజకవర్గంలో ఏడాదిలోగా పట్టణంలో 5 వేలు, గ్రామాల్లో 300ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించాలనీ డిమాండ్ చేశారు. దత్తత అనే మాటకు అర్ధం తేవాలంటే పేదలకు ఇళ్లు ఇవ్వాలని అన్నారు. అభివృద్ధి అంటే వెడల్పు చేసి బొమ్మలు పెట్టడం కాదని మండిపడ్డారు.

జనవరి నుంచి నల్గొండలో రెగ్యులర్​గా పర్యటించనున్నట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో పలు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రూ.378 కోట్లతో రీటెండర్ వేయించి నాగార్జున సాగర్ హైవే పూర్తి చేయించానని అన్నారు. సీటు వచ్చినా ప్రభుత్వం ఫీజు రియింబర్స్​మెంట్ ఇవ్వడం లేదనీ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ ఏడాది 28 మంది విద్యార్థులకు ఆర్ధిక సాయం అందజేసినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ కార్యవర్గాన్ని తాజాగా ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే పీఏసీ, పీఈసీల్లో ప్రజా ప్రతినిధులకు చోటు కల్పించిన అధిష్ఠానం.. ఆ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు కల్పించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆదివారం కోమటిరెడ్డిని ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌ కండువా ఉంది.. మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మునుగోడు ఉప ఎన్నికలో వ్యవహరించిన తీరుతోనే ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీల్లో కోమటిరెడ్డికి స్థానం దక్కలేదని ప్రచారం సాగుతోంది. పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం కోసం పరోక్షంగా పనిచేశారనే ఆరోపణలతో రెండు సార్లు ఇప్పటికే పార్టీ జాతీయ కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల తిరుమల పర్యటనలో మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు, ఎన్నికలకు నెల ముందు తన అభిప్రాయం వ్యక్తం చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆయనను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

"నల్గొండలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. భవిష్యత్తులో నల్గొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాగా 20 వేల‌ ఇళ్లు ఎందుకు కట్టలేదు? ఎన్నికల‌కు నెల ముందు వరకు రాజకీయాలు మాట్లాడను మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?ప్రస్తుతం కాంగ్రెస్ కండువా ఉంది.. తర్వాత సంగతి తర్వాత."-కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details