KGBVs Orientation Program: రాష్ట్ర వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో 1,543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతిచ్చి ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి నియామక పత్రాలు ఇచ్చామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలో బోధన ప్రక్రియ కొనసాగాలని.. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాలికల విద్య ప్రాధాన్యాన్ని గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం తదనుగుణంగా విద్యాభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తోందని మంత్రి వివరించారు.
KGBV Part Time PGTs Protest: 'ఇన్నేళ్లు పని చేయించుకుని తొలగించారు.. న్యాయం చేయండి'
కేజీబీవీల్లో కొత్తగా ఎంపికయిన 1,543 మంది ఉపాధ్యాయులకువిజయవాడ సమీపంలోని నిడమనూరులో పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ.. కేజీబీవీల్లో కొత్తగా ఎంపికై బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయ సిబ్బందికి నియామకపత్రాలు అందించి వారిని అభినందించి నియామక పత్రాల్ని అందజేశారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువు పూర్తి చేసుకొన్న పూర్వ విద్యార్థినిలకు జ్ఞాపికలను అందించారు. బడి మానేసిన పిల్లలు, అనాధ పిల్లలు, పాక్షిక అనాధ పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల పిల్లలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ ప్రవేశాలకు అనుమతి కల్పించడం, ఇంటర్మీడియట్ను కూడా కేజీబీవీల్లో ప్రవేశ పెట్టడం వల్ల బాలికల నమోదు శాతం పెరుగుతోందని ఆయన అన్నారు. తొలుత రాష్ట్రంలో 53 కేజీబీవీలు, 6,380 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాలయాల సంఖ్య ప్రస్తుతం 352కు చేరడంతో పాటు విద్యార్థుల సంఖ్య దాదాపు లక్షకు చేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ ప్రవీణ్ ప్రకాష్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.