ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలి ఘట్టమే కీలకం...! - గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ

గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ ప్రారంభం కావడంతో.. గ్రామ రాజకీయాలు ఊపందుకున్నాయి. గ్రామస్థాయి నేతలు పట్టు నిలుపుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకునే దిశగా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పేరుతో ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో అధికారపార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.

key role of nominations in first phase of panchayat elections
తొలి ఘట్టమే కీలకం...!

By

Published : Jan 30, 2021, 3:35 PM IST

గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నామపత్రాల స్వీకరణ ప్రారంభం కావడంతో గ్రామ రాజకీయాలు ఊపందుకున్నాయి. రాజకీయపార్టీలు గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటాపోటీగా జరుగుతున్నాయి. గ్రామస్థాయి నేతలు పట్టు నిలుపుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకునే దిశగా సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పేరుతో ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో అధికారపార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన తెదేపా, జనసేన, భాజపా అన్ని స్థానాల్లో తమ మద్దతుదారులను నిలిపే దిశగా కసరత్తు చేస్తున్నారు. అధికారపార్టీ సింహభాగం పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేయాలన్న లక్ష్యంతో ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యేలా పావులు కదుపుతున్నారు. ఆశావహులు ఎక్కువ ఉన్నచోట తిరుగుబాటుదారులు బరిలోకి దిగకుండా పదవుల పంపిణీలో న్యాయం చేస్తామని సర్దిచెబుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు నామినేషన్‌ వేయకుండా సామ, దాన, దండోపాయాల ద్వారా తమ దారికి తెచ్చుకోవడానికి మంత్రాంగం చేస్తున్నారు. తీరప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఈ తరహా సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో పట్టున్న నేతలు ప్రత్యర్థి పార్టీల్లో ఉంటే వారిని తమ వైపు తిప్పుకునేలా అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శుక్రవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు ఆపార్టీ నేతలతో సమావేశమై ఆయా నియోజకవర్గాల వారీగా పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. గ్రామాల్లో సమైక్యంగా ఉంటూ ఏకగ్రీవాలకు సహకరిస్తే అభివృద్ధి బాట పడతాయని ప్రజలకు వివరించి ఆదిశగా అడుగులు వేయాలని మంత్రి సూచించినట్లు తెలిసింది.

జిల్లాలో వీలైనన్ని ఏకగ్రీవాలు చేయడం, పోటీ అనివార్యమైన చోట బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి.. విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికారపార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షించి ద్వితీయశ్రేణి నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. గట్టి పోటీ ఉన్న గ్రామాల్లో అనుసరించే వ్యూహాలపై స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే సమాచారం తెప్పించుకున్న నేతలు విజయానికి వ్యూహాలపై కసరత్తు వేగవంతం చేశారు. ప్రధానంగా సర్పంచు పదవి కోసం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పుడు ఒకరికి సర్పంచు, మరొకరి నామినేటేడ్‌ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుందో వేచిచూడాల్సిందే.

అభ్యర్థులకు అండగా.. :ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అన్ని పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు చేయాలని పార్టీ సానుభూతిపరులకు సూచించింది. బలవంతపు ఏకగ్రీవాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, అలాంటి పరిస్థితి ఎదురైనచోట్ల పార్టీ తరపున అభ్యర్థులకు న్యాయవిభాగం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో 25 మంది సభ్యులతో కూడిన న్యాయవాదుల బృందం అందుబాటులో ఉంటుంది. నామినేషన్లు దాఖలు నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు అభ్యర్థులకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలు ఆయా మండలాల నాయకులతో చర్చించి సర్పంచు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో నేతలు వార్డు సభ్యులను ఎంపికచేసి పోటీకి సిద్ధం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గనేతలు మండల, గ్రామస్థాయి నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల విజయానికి కృషిచేసేలా కమిటీలు పనిచేస్తున్నాయి. అన్నిచోట్ల పోటీకి నిలపడంతోపాటు విజయమే లక్ష్యంగా వ్యూహాలు అమలుచేస్తున్నారు. నామినేషన్లు వేయడంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జోక్యం చేసుకుని నామినేషన్‌ వేసేలా చూడటానికి ఏర్పాట్లు చేశారు.

కలసికట్టుగా..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాజపా, జనసేన సంయుక్తంగా పోటీచేయడానికి సిద్ధమయ్యాయి. రెండు పార్టీలకు చెందిన నియోజకవర్గస్థాయి నేతల సమక్షంలో ఏపార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీచేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని ఇరుపార్టీల నేతలు కార్యకర్తలకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో పరిష్కారం కాని అంశాలను పార్లమెంటు నియోకవర్గాల సమన్వయ కమిటీలు పరిష్కరిస్తాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కొక్కపార్టీ నుంచి ఐదుగురు చొప్పున పదిమందితో సమన్వయ కమిటీ ఏర్పాటుచేశారు. ఈకమిటీ అందరినీ సమన్వయం చేసుకుంటూ పోటీచేసే స్థానాలపై అవగాహనకు వచ్చి నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తంమీద ఇరుపార్టీలకు పట్టు ఉన్న గ్రామాల్లో బోణీ కొట్టాలని ఉత్సాహంగా ఉన్నారు. జనసేన తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడంతో స్థానికపోరు కొన్ని గ్రామాల్లో ఆసక్తిగా మారింది.

వామపక్షాలు ప్రభావం ఉండేనా?

జిల్లాలో ఒకప్పుడు వామపక్ష పార్టీలకు వినుకొండ, మంగళగిరి, సత్తెనపల్లి, రేపల్లె నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఆపార్టీ అభ్యర్థులు విజయం సాధించేవారు. ప్రస్తుతం ఆపార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చదవండి:ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ

ABOUT THE AUTHOR

...view details