సుశీ ఇన్‌ఫ్రా వందల కోట్ల జీఎస్టీ ఎగవేత GST Raids on Sushi Infra Company: తెలంగాణలో భాజపా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్‌రెడ్డి, అయన కుటుంబ సభ్యులు, బంధువులు నిర్వహిస్తున్న సుశీ ఇన్‌ఫ్రా సహా అనుబంధ సంస్థల, వ్యాపార కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు పరిశీలనలో అధికారులు గుర్తించారు. వ్యాపారసంస్థలు క్రమంగా వేయాల్సిన.. జీఎస్టీ రేట్లను సక్రమంగా వేయలేదని తేల్చారు.
సోమవారం రోజున 16 సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో, స్వాధీనం చేసుకున్న దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులకు పంపిన 23 ఎలక్ట్రానిక్ పరికరాల వివరాలు వాణిజ్య పన్నుల అధికారులకు అందినట్లు తెలుస్తోంది. వాటిని.. పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని తెలిపారు. మంగళవారం రోజున సుశీ ఇన్‌ఫ్రా ప్రధాన కార్యాలయం లాకర్ నుంచి, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ అబిడ్స్ వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అధికారుల బృందం పర్యవేక్షణలో దస్త్రాలపరిశీలన కొనసాగుతోంది. ప్రధానంగా జీఎస్టీ చట్ట ప్రకారం, వ్యాపార లావాదేవీలు జరిగాయా లేదా అనేది నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ సంస్థలు నిర్వహించిన వ్యాపార కార్యకలాపాలు, ఆ సంస్థలు చెల్లించిన జీఎస్టీ సక్రమంగా ఉందా లేదా, చెల్లించాల్సింది ఎంత అన్నవి పరిశీలిస్తున్నారు.
ఆ సమయంలో భారీగా అక్రమాలు వెలుగుచూస్తున్నట్లు రాష్ట్ర జీఎస్టీ అధికారులు తెలిపారు. వ్యత్యాసాలు పెద్దమొత్తంలో ఉంటున్నాయని భావిస్తున్నారు. దస్త్రాల పరిశీలన కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల వేళ సుశీ ఇన్‌ఫ్రా ఖాతాల నుంచి భాజపా నాయకులకు, పెద్ద మొత్తంలో నగదు బదిలీచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లగా, వివరాలను జీఎస్టీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది వాటి అధారంగా, జీఎస్టీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: