Key Decisions in AP Cabinet Meeting: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
జగనన్న అమ్మ ఒడి పథకం అమలును జూన్ 28 తేదీకి వాయిదా వేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు 6వేల 888కోట్ల రూపాయలను వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం 445 కోట్ల రుణాల కోసం ఏపీ ఎఫ్ఎస్ఎల్కు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదించింది.
మరోవైపు రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు డెయిరీ ప్లాంట్‌కు చెందిన 28 ఎకరాల భూమినీ లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది. కేబినెట్ మీటింగ్ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.
కొత్తగా 6840 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2014 జూన్ 2 తేదీ నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్ చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ శాఖగా మార్పు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ విధానాన్ని అమలుచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయాలు:
- కొత్తగా 6,840 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
- 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు ఉన్న ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణకు ఆమోదం
- వైద్య విధాన పరిషత్ చట్టాన్ని రద్దుచేసి ప్రభుత్వ శాఖగా మార్చాలని నిర్ణయం
- వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 010 హెడ్ నుంచి వేతనాలివ్వాలని నిర్ణయం
- ఏపీ గ్యారంటీ పింఛన్ పథకం అమలుకు నిర్ణయం
- పదవీ విరమణ వేళ ఉద్యోగుల వేతనంలో 50 శాతం పింఛన్‌గా ఇవ్వాలని నిర్ణయం
- 16 శాతం హెచ్‌ఆర్‌ఏను అన్ని జిల్లా కేంద్రాల్లో అమలుకు ఆమోదం
- ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం
- 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణకు కేబినెట్ ఆమోదం
- చిత్తూరు డెయిరీ నిర్వహణ అముల్‌కు ఇవ్వాలని నిర్ణయం
- అమూల్‌కు 28 ఎకరాలను 99 ఏళ్ల లీజుకు ఇవ్వాలని నిర్ణయం
- కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో 2,118 పోస్టుల భర్తీకి నిర్ణయం
- జూన్ 12 నుంచి 17 వరకు విద్యా కానుక వారోత్సవాలు
- అమ్మఒడి ఆర్థిక సహకారాన్ని జూన్ 28న ఇవ్వాలని నిర్ణయం
- 476 జూనియర్ కళాశాలల్లో వాచ్‌మెన్ నియామకానికి ఆమోదం
- గ్రీన్ హైడ్రోజన్, అమోనియా పాలసీకి కేబినెట్ ఆమోదం
- హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహం
- ఏపీఎఫ్ఎస్ఎల్‌కు రూ.445 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం
- గ్రామాల్లో 5జీ నెట్‌వర్క్ కోసం రుణ సేకరణకు కేబినెట్ ఆమోదం
- 10 వేల మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం
- వైద్య విధాన పరిషత్‌లోని 14,653 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం
- సీపీఎస్ రద్దు చేసి జీపీఎస్ తీసుకురావడానికి నిర్ణయం
- ప్రతి మండలంలో 2 జూనియర్ కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం
- టోఫెల్ సర్టిఫికేషన్ కార్యక్రమం అమలుకు కేబినెట్ ఆమోదం
- 3-10వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణకు కేబినెట్ ఆమోదం
- ఏడాదికి రూ.18 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం