KANNA LAXMI NARAYANA RESIGNED TO BJP : బీజేపీకి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలకు తెరపడింది. రాజీనామాపై గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు నేడు స్పష్టత వచ్చింది. గుంటూరులోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశం అనంతరం బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా ప్రకటించారు. సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించి రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రవర్తన బాగా లేకనే రాజీనామా చేసినట్లు కన్నా తెలిపారు. తనతో పాటు రాజీనామా చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానన్నారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నాయకుల కారణంగా పార్టీలో మనుగడ సాగించలేనని కన్నా తేల్చిచెప్పారు. 2014లో మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో పనిచేస్తూ.. రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి 2019 ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసినట్లు వెల్లడించారు. జగన్ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజల తరఫున అనేక సమస్యలపై పోరాటం చేశానన్నారు.
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా "2014లో మోదీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలో చేరా. బీజేపీలో ఏ స్థానంలో ఉన్నా కార్యకర్త మాదిరిగా పనిచేశా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని చోట్ల అభ్యర్థులను నిలబెట్టా. 2019 తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషిచేశా. 2024లో బీజేపీను అధికారంలోకి తేవడం కోసం పనిచేశా. అయితే కొందరి స్థానిక నేతల కారణంగా పార్టీలో ఇమడలేక రాజీనామ చేస్తున్నా"-కన్నా లక్ష్మీ నారాయణ
కరోనా తర్వాత తనని మార్చి సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేసినట్లు తెలిపారు. మోదీపై తనకున్న అభిమానం ఎప్పటికీ చెదరదని తేల్చిచెప్పారు. పార్టీలో ఏ స్థానంలో ఉన్నా కార్యకర్త మాదిరిగానే పనిచేశానన్నారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారన్నారు. అమరావతికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు అన్న కన్నా.. జగన్ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తాను పోరాడినట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగానే రాజధానిపై తీర్మానం చేసినట్లు తెలిపిన కన్నా.. సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక పరిస్థితి మారిందని వెల్లడించారు. మోదీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని.. కానీ ప్రస్తుత పరిణామాలతో బీజేపీలో ఇమడలేక పోయానన్నారు.
భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నా కన్నా.. బీజేపీ నాయకత్వం తనతో ఇప్పుడు మాట్లాడలేదని తెలిపారు. రాత్రికి రాత్రే నాయకులు కావాలనుకునే వారికి కాపులు కావాలని.. అందుకేనేమో జీవీఎల్.. వంగవీటి రంగా గురించి మాట్లాడారన్నారు. కాపు ఉద్యమంలో తాను మొదటి నుంచీ ఉన్నట్లు తెలిపారు.ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద తాను పనిచేసినట్లు తెలిపారు. జీవీఎల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని.. వంగవీటి రంగా పేరు జిల్లాకు పెడితే మొదట సంతోషించేది తానేనన్నారు. తాను ఏ పార్టీలో పనిచేసినా పదవులు ఆశించలేదని.. కాంగ్రెస్‌లో 40 ఏళ్లున్నా ఎవరి వద్దకు వెళ్లి పదవి అడగలేదన్నారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.
"బీజేపీ నాయకత్వం నాతో ఇప్పుడు మాట్లాడలేదు. రాత్రికి రాత్రే నాయకులు కావాలనుకునే వారికి కాపులు కావాలి. అందుకేనేమో జీవీఎల్.. వంగవీటి రంగా గురించి మాట్లాడారు. కాపు ఉద్యమంలో నేను మొదటినుంచీ ఉన్నా. ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద నేను పనిచేశా. జీవీఎల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా పేరు జిల్లాకు పెడితే మొదట సంతోషించేది నేనే. నేను ఏ పార్టీలో పనిచేసినా పదవులు ఆశించలేదు. కాంగ్రెస్‌లో 40 ఏళ్లున్నా ఎవరి వద్దకు వెళ్లి పదవి అడగలేదు"-కన్నా లక్ష్మీ నారాయణ
ఇవీ చదవండి: