ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థపై కళాంజలి కళాసమితి ఆధ్వర్యంలో టెలీ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభోత్సవం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగింది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్లాప్ కొట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వాలంటీర్ల ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థపై చిత్రం నిర్మిస్తున్న కళాంజలి కళాసమితి అధ్యక్షుడు, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీనారాయణను ఎమ్మెల్యే అభినందించారు. మెరుగైన సేవలు అందించిన వాలంటీర్లను ఎమ్మెల్యే సత్కరించారు. వారికి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శ్రీధర్, స్థానిక తహసీల్దార్ తరుణ్ కుమార్, ఎంపీడీవో శోభారాణి తదితరులు పాల్గొన్నారు.