KA Paul on Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా అడ్డుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలువరించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్, లాభనష్టాలను చూసేందుతు తెలుగు తెలిసిన విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా ఆదేశించాలన్నారు.
స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ ద్వారా విరాళాలను సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కేంద్ర ఆర్థిక, ఉక్కు, గనులశాఖ కార్యదర్శులు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ స్టీల్ ప్లాంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పార్టీ ఇన్ పర్సన్‌గా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం ఆస్తులను విక్రయిస్తోందన్నారు. 17 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఏపీలోని గంగవరం పోర్టును రూ.600 కోట్లకు విక్రయించారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో నడవడం లేదన్నారు. 3.7 లక్షల కోట్ల రూపాయల విలువ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆ విలువలోని కేవలం 3 శాతం ఖరీదుకే అమ్ముతున్నట్లు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలతోపాటు అధికార వైసీపీ, అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయన్నారు.