Fake CBI Officer: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావును ఢిల్లీ రౌస్ అవెన్యూ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. తదుపరి విచారణను ఈనెల 16కి వాయిదా వేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. గత నాలుగు రోజుల్లో.. ఆరుగురు సాక్షులను విచారించినట్లు చెప్పిన సీబీఐ.. తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, శ్రీనివాసరావు మాట్లాడిన 1100 కాల్ రికార్డులు పరిశీలిస్తున్నట్లు కోర్టుకు చెప్పింది. సీబీఐ అధికారిగా ఎందుకు అవతారం ఎత్తాడో.. విచారణ జరపడానికి మరికొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులను ఎవరెవరిని ప్రలోభాలకు గురి చేశారో విచారణలో తేలాల్సి ఉందన్న సీబీఐ.. శ్రీనివాసరావుతో ఉన్న సంబంధాలపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేస్తున్నట్లు తెలిపింది. కొవ్విరెడ్డి విచారణకు సహకరించడం లేదని, విచారణ కోసం మరింత పోలీస్ కస్టడీ పొడిగించాలని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేట్ వ్యక్తులను మోసం చేస్తూ భారీ కుట్రకి పాల్పడుతున్నారని, సీబీఐ జాయింట్ డైెరెక్టర్‌గా చెప్పుకుంటున్నారన్న దర్యాప్తు సంస్థ.. నాలుగు రోజుల్లో ఆరుగురు సాక్షులను విచారించినట్లు చెప్పింది.