జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే నిరుద్యోగులకు అండగా నిలిచి వారితో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని జనసేన ప్రకటించింది. ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను వంచనకు గురిచేసిందన్నారు. ఉద్యోగార్థలకు ప్రయోజనం లేని జాబ్‌క్యాలెండర్ విడుదల చేశారని దుయ్యబట్టారు. 2.6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దగా చేశారని మండిపడ్డారు.
కష్టానికి తగిన ప్రతిఫలం అందక రైతులు కన్నీరు పెడుతుంటే..ప్రభుత్వంలో స్పందన కరవైందన్నారు. కొవిడ్ పరిస్థితుల్లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని... ప్రభుత్వానికి వరి పంట విక్రయించినా డబ్బులు కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారన్నారు. తొలకరి పంటకు పెట్టుబడిలేక రైతులు అప్పుల పాలవుతున్నారని సమావేశంలో నేతలు ఆక్షేపించారు. రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి వారికి భరోసా ఇచ్చేలా పోరాటం చేయాలని పార్టీ తీర్మానించింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్ప చిత్తశుద్ధి కనిపించడం లేదని చెప్పారు. దిశ చట్టం, యాప్, పోలీసు స్టేషన్లు కేవలం ప్రచారం కోసం తప్ప మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టే వారిని కట్టడి చేసి శిక్షించేందుకు ఉపయోగపడడం లేదన్నారు. కృష్ణానది తీరంలో యువతిపై అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు అరెస్టు చేయలేకపోవటమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.