వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో సమన్వయ లోపం - Jowar Unloading Problem in guntur
ప్రభుత్వం జరుపుతున్న వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో.. ప్రణాళిక, సమన్వయ లోపం కారణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను.. గోదాముల్లో నిల్వచేయటంలో జాప్యం జరుగుతోంది. గోదాములు, హమాలీలు పరిమితంగా ఉండటంతో.. సరకు తరలిస్తున్న వాహనాలు గుంటూరు జిల్లాలో వందల సంఖ్యలో బారులుతీరాయి.

గుంటూరు జిల్లాలో జొన్న, మొక్కజొన్న పంటల ధరలు పతనమయ్యాయి. దీంతో రైతులను ఆదుకునేందుకు.. ప్రభుత్వం, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది. ఇలా కొనుగోలు చేసిన సరకును గోదాములకు తరలించటం, నిల్వచేయటంలో అధికారులు తగిన చర్యలు తీసుకోలేదు. గుంటూరు గ్రామీణ మండలంలోని చౌడవరంలో.. ఓ ప్రైవేటు గోదామును అద్దెను తీసుకుని సరుకు నిల్వచేస్తున్నారు. ప్రస్తుతం వంద లారీలకు పైగా పంట ఇక్కడకు చేరింది. అయితే హమాలీలు.. రోజుకు 20 నుంచి 30 లారీల సరకు మాత్రమే అన్లోడ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ పెద్ద ఎత్త్తున లారీలు బారులు తీరాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన తాము మూడు, నాలుగు రోజుల నుంచి ఇక్కడ వేచి ఉన్నామని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. గోదాము ఊరికి దూరంగా ఉండటంతో తిండికి, మంచినీటికి కూడా ఇబ్బందిగా ఉందని డ్రైవర్లు వాపోతున్నారు.