Jobs to Btech Students In AP:రాష్ట్రంలో చదువులు అధ్వాన్నంగా తయారవడంతో.. విద్యార్థులు కొలువులకు దూరమవుతున్నారు. గత నాలుగేళ్లలో సరాసరిన 63 శాతం మంది బీటెక్ విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణలవుతున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో లక్షా 32వేల మందిలో కేవలం 51 వేల మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. ఏఐసీటీఈ నివేదిక ద్వారా ఈ వివరాలు బహిర్గతమయ్యాయి.
ఉన్నత విద్యలోనూ ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్‌ను ప్రవేశపెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానంతో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది జూలై 20న హైపవర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన. కానీ వాస్తవంలో బీటెక్‌లో చేరిన వారిలో సరాసరిన 63 శాతమే ఉత్తీర్ణులవుతున్నారు. పాస్ శాతం పెరగాలంటే నాణ్యమైన విద్యను అందించాలి. అందుకు తగిన విధంగా మౌలిక వసతులు కల్పనపైనా దృష్టి పెట్టాలి కదా. ఫ్యూచర్ టెక్నాలజీ ప్రవేశ పెట్టాలని గొప్పగా చెప్పిన సీఎం జగన్.. విశాఖలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని అటకెక్కించారు.
సాఫ్ట్‌వేర్ స్వప్నం.. ఆకర్షణీయమైన వేతనం.. అత్యుత్తమ జీవనం.. రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థుల కల ఇది. ఇందుకోసం బీటెక్‌లో చేరుతున్నా.. ఆ తరహా ఉద్యోగాలు దక్కించుకుంటున్నవారు తక్కువగానే ఉంటున్నారు. ఇతర అండర్ గ్రాడ్యుయేట్‌లతో పోల్చితే బీటెక్ విద్యార్హతతోనే ఎక్కువ ఉద్యోగ అవకాశాలున్నా.. ప్రవేశాలు, ప్రాంగణ నియామకాల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది.
BTech Students: చదివేది బీటెక్... చేసేవీ చీప్ పనులు..
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థుల సరాసరి ఉత్తీర్ణత 63 శాతమే ఉంటోంది. ఇందులోనూ సగంమంది విద్యార్థుల కంటే తక్కువగానే ఉద్యోగాలు సాధిస్తున్నారు. సంవత్సరాల వారిగా కళాశాలల్లో ప్రవేశాలు పొంది.. ఉత్తీర్ణులై, ఉపాధి పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
గత నాలుగు సంవత్సరాల వివరాలు..
- 2019-20 సంవత్సరంలో 92వేల 865 ప్రవేశాలు నమోదు కాగా అందులో కేవలం 69వేల 431 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 48వేల 64 మంది ఉపాధి పొందారు.
- 2020-21లో లక్షా ఒక వేయి 534 ప్రవేశాల్లో.. 67వేల 233 మంది ఉత్తీర్ణలయ్యారు. అందులో 45వేల 217 మంది ఉద్యోగాలు సాధించారు.
- 2021-22లో లక్షా 20వేల 505 ప్రవేశాల్లో 73వేల 932మంది ఉత్తీర్ణత సాధించగా... 55వేల 320 మంది ఉపాధి పొందారు.
- 2022-23లో లక్షా 32వేల 67 ప్రవేశాల్లో 65వేల 680మంది ఉత్తీర్ణలవగా.. 51వేల 213మంది ఉద్యోగాలు సాధించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాల కొరత, రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేకపోవడమే దీనికి కారణం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో లక్షా 32వేల మంది చేరితే వారిలో ఉపాధి పొందిన వారు 51 వేల మంది మాత్రమే. ప్రవేశాలతో పోల్చితే ఇది 39శాతం. ఫాసైన వారితో పోల్చినప్పుడు ఉద్యోగాలు సాధించిన వారు 78 శాతమే. ఇందులో డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సాంకేతిక విద్యాసంస్థలు, ప్రైవేటు వారే ఎక్కువమంది ఉన్నారు.