గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షాహిదా బీటెక్‌లో బంగారు పతకం సాధించింది. ఆమె తల్లి టైలరింగ్ చేస్తూ.. షాహిదాను చదివించింది. మంచి ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఆశతో.. నౌకరీడాట్ కామ్‌లో తన బయోడేటా నమోదు చేసుకున్నారు. కొద్ది రోజులకు మీ వివరాలు చూశామని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తాం అని కొందరు ఫోన్లో మాట్లాడి నమ్మించారు. దరఖాస్తు రుసుం 1800 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 4,500 రూపాయలు ఆన్ లైన్లో కట్టించుకున్నారు.
కరోనా కారణంగా ఆన్లైన్లో ఇంటర్వ్యూ అంటూ మాట్లాడారు. అనంతరం ఎంపికయ్యారంటూ.. ఉద్యోగ నియామక ధ్రువపత్రం పంపించారు. వివిధ రకాల ఛార్జీల పేరుతో లక్ష రూపాయలు కట్టించుకున్నారు. గుర్తింపు కార్డులకు ఇతర ఖర్చులంటూ ఇంకా నగదు పంపించాలని డిమాండ్ చేయడంతో ఆమెకు అనుమానం వచ్చింది. విచారిస్తే నకిలీ ఉద్యోగ ఎంపిక ధ్రువపత్రంగా తేలింది. దీంతో షాహిదా పోలీసులను ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని కోరింది.