Jagananna Vidya deevena: జగనన్న విద్యాదీవెన మూడో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన డబ్బులను సీఎం జగన్ విడుదల చేశారు. దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు సంబంధించి 9 లక్షల 87 వేల 965 మంది తల్లుల ఖాతాల్లో రూ.686 కోట్లను విడుదల చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే పేద విద్యార్థులకు విద్యాదీవెన ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు తెలిపారు. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, పెద్ద స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. పేద పిల్లలకు అండగా నిలబడేందుకే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. పేదరికం పోవాలన్నా, పేదల తలరాతలు మారాలన్నా ప్రతి వర్గంలో నుంచి పిల్లలు మంచి చదువులు చదవాలన్నారు. పెద్ద చదువులు చదివితేనే పేదల తలరాతలు మారతాయని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1,778 కోట్లు బకాయిలను ఈ ప్రభుత్వమే చెల్లించిందన్న సీఎం..జగనన్న విద్యా దీవెన ద్వారా ఇప్పటివరకు మొత్తం 6,259 కోట్లు చెల్లించిందన్నారు. 21 లక్షల 48 వేల 477 మంది విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు.
CM Jagan: విద్యా వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకువచ్చామని సీఎం జగన్..గతంలో అరకొరగా ఫీజులు ఇచ్చే వారని, వీటిని సమూలంగా మార్పులు చేసి ఫీజుమొత్తాన్నంతా చెల్లిస్తున్నామన్నారు. అర్హులైన పేద విద్యార్థులకు వందకు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివే పీజీ కోర్సులకూ ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రులే నేరుగా ఫీజలు చెల్లించడం ద్వారా కళాశాలలపై పర్యవేక్షణ పెరుగుతుందని, కళాశాలలో వసతులను తల్లులు పరిశీలించి లోటు పాట్లుంటే యాజమాన్యాలను ప్రశ్నిస్తారన్నారు. దీనివల్ల కళాశాలలకు జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. సమస్యలపై 1902 నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఫీజులను సకాలంలో తప్పనిసరిగా కళాశాలకు చెల్లించాల్సిన బాధ్యత తల్లులపై ఉందన్న జగన్...అలా చేయకపోతే కళాశాలల అకౌంట్లకే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.