Rambabu victims : పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మంత్రి అంబటి రాంబాబు బాధితురాలికి జనసేన పార్టీ తరఫున నాలుగు లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్.. బాధితురాలు తురకా గంగమ్మకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చెక్కు అందజేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీసినందుకు గంగమ్మకు మంత్రి రాంబాబు తీవ్ర అన్యాయం చేశారని మనోహర్ చెప్పారు. ఆయన బాగోతాన్ని బయటపెట్టినందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఐదు లక్షల రూపాయల చెక్కును సైతం వెనక్కి పంపించారని.. ఆమెకు ఆ డబ్బులు తిరిగి వచ్చేంతవరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు. గంగమ్మకు పరిహారం అందించడంలో అలసత్వం చూపించిన అధికారులనూ వదలబోమని మనోహర్ హెచ్చరించారు. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు రావాల్సిన ఇంటిని ఆపేశారని గంగమ్మ చెప్పారు.
ఊహించని విధంగా అనేక నియోజకవర్గాల్లో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పల్నాడులో పరిస్థితి దారుణంగా ఉంది. పోలీసులతో అణచివేతకు పాల్పడుతున్నారు. కొడుకును కోల్పోయి గంగమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి రాంబాబు.. సీఎం సహాయనిధి చెక్కు ఇవ్వకుండా జాప్యం చేశారు. చెక్కు ఇవ్వమని కోరితే పార్టీ నాయకులు కొన్ని డబ్బులు అడగడం బాధాకరం. ఆ పరిస్థితిని బయటకు చెప్పుకునేందుకు భయపడుతున్న తరుణంలో జనసేన అండగా నిలిచింది. పేద మహిళ విషయంలో ఇబ్బంది పెట్టడమే గాకుండా చెక్కును వెనక్కి పంపడం బాధాకరం. శవాలపై పేలాలు ఏరుకుంటారా..? ఈ విషయంలో జనసేన తరఫున పోరాటం చేస్తాం. - నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు