Janasena Leader Nadendla Manohar Comments On Ysrcp : సామాన్యులు సైతం రాజకీయాలు చేసేందుకు జనసేన పార్టీ వేదికలా మారిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ మండల అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జనసేన చేయదు :స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఎన్ని వేధింపులకు గురి చేసినా జనసేన పార్టీ నాయకులు పట్టుదలతో పోటీ చేసి చాలా చోట్ల విజయం సాధించారన్నారు. వైఎస్సార్సీపీ సర్కారు ప్రతిపక్షాలను నిలువరించాలని తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టివేయడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను జనసేన ఎప్పటికీ చేయదని నాదెండ్ల మనోహర్ అన్నారు.
జనసైనికులు అప్రమత్తంగా ఉండాలి.. రేపటి రోజున అధికారంలోకి రావాలి : జనసేన పార్టీ నేతలపై పెట్టే అక్రమ కేసులు ఎదుర్కొనేందుకు లీగల్ ఖర్చులు కూడా పార్టీయే భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటి వరకు 132 మంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున అందించి ఆర్థికంగా ఆదుకున్నట్లు తెలిపారు. జనసేన పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కార్యక్రమం వైఎస్సార్సీపీ మొదలు పెట్టిందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలి... మన నాయకుడిని గెలిపించుకోవాలంటే అందరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు.