NAdendla on YSRCP: వైకాపా ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జగన్ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యలకు ఎలాంటి నష్టపరిహారమూ అందడం లేదన్నారు. రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకని నిలదీశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. అన్నదాత ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. రైతు భరోసా కేంద్రాలు అంటూ.. ఆరు కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. పంట నష్ట పరిహారం అందించడం, సబ్సిడీ ద్వారా విత్తనాలు కొనుగోలు వంటి విషయాల్లో కులం, పార్టీని చూసి ప్రభుత్వ సాయం అందిస్తున్నారని ఆరోపించారు. ఈ తరహా ప్రభుత్వ విధానాలను జనసేన వ్యతిరేకిస్తుందన్నారు.
ధైర్యంగా ఉండండి.. మీ కోసమే పవన్ యాత్ర: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను ఆదుకునేలా.. కౌలు రైతులు భరోసా కార్యక్రమాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారని మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రతి కుటుంబానికి తమవంతు ఆర్థిక సహాయంగా రూ. లక్ష నగదు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమం తొలుత తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభం కానుందని.. త్వరలో గుంటూరులోనూ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాలని... వారి కోసమే పవన్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.