Dharna In Front Of YSRCP Central office : అతనో వైఎస్సార్సీపీ నాయకుడు. ప్రజల సేవే తన ధ్యేయం అంటూనే పలువురిని నట్టేట ముంచాడు. ఇతనికి ఓ సైడ్ బిజినెస్ కూడా ఉందండోయ్. అదే రియల్ ఎస్టేట్. పేద ప్రజల కష్టాన్ని, వారి పిల్లల బంగారు భవిష్యత్‌ను ప్రశ్నార్ధకంగా మార్చాడు. వారు చెమటోడ్చి, తిని తినకుండా పోగు చేసుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి దండుకున్నాడు. తిరిగి ఇవ్వమంటే అధికార దర్పం ప్రదర్శిస్తున్నాడు. ప్రసుత్తం తమ గోడును సీఎం జగన్‌కు విన్నవించడానికి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
చంపుతానని బెదిరింపులు : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామస్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ అశోక్‌బాబు తమ వద్ద దాదాపు రూ.ఆరు కోట్లకు పైగా డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 నుంచి 2018 వరకు తమ గ్రామంలో అశోక్ బాబు స్థిరాస్తి వ్యాపారం చేసే సమయంలో డబ్బులు తీసుకున్నారని.. ఇప్పుడు వాటిని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్నీ ఆధారాలున్నాయని చెప్పారు. జానపాడు గ్రామస్థులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తుండగా.. కార్యాలయ సిబ్బంది వచ్చి వారిని లోపలికి తీసుకెళ్లారు. వారు తీసిన వీడియోలను సైతం డిలీట్ చేయించారు. సాయంత్రం పెద్ద నాయకులు వస్తారని అప్పటి వరకు మౌనంగా ఉండాలని హెచ్చరించారు.