Rivers Linking Project: నదుల అనుసంధానం ప్రాజెక్టుల నినాదం కొత్తది కాకపోయినా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారిన జల అవసరాలు, వివిధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి శాఖలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ.. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టేందుకు కార్యాచరణ ప్రారంభించింది.
Rivers Linking Project in ap - telangana: గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరీ నదుల అనుసంధానం ద్వారా ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నీటి అవసరాలను పెద్ద ఎత్తున తీర్చేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన మూడు రాష్ట్రాలతోనూ కేంద్ర జలశక్తి శాఖ సంప్రదింపులు జరుపుతోంది. గోదావరిలోని ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్, సోమశిల, తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్ వరకూ నదులను అనుసంధానించనున్నారు. తద్వారా తెలంగాణాలోని నల్గొండ, ఏపీలోని ప్రకాశం , నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తమిళనాడులోని తిరువళ్లూర్, వెల్లోర్, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూర్, కాంచీపురం లాంటి ప్రాంతాలకు నేరుగా నీటి ప్రాజెక్టులు అనుసంధానం కానున్నాయి. ఇక ఉప ప్రాజెక్టుల ద్వారా తెలంగాణాలోని వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఏపీలోని గుంటూరు, తమిళనాడులోని తంజావూర్ జిల్లాలకూ ప్రయోజనం కలగనుంది. నాగార్జున సాగర్ తో పాటు మూసీ డ్యామ్ వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా చేపట్టే అవకాశముందని కేంద్ర జలశక్తి శాఖ చెబుతోంది. ఈ అనుసంధానానికి తొలిదశలో 85 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.