Jagananna Videshi Vidya Deevena Scheme Fraud: పేద విద్యార్థులకు, విదేశీ విద్యపై సీఎం జగన్ గొప్పగా మాట్లాడారు కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మేలు జరగకుండా పథకాలను ఎలా అమలు చేయవచ్చో జగన్‌కు బాగా తెలిసినట్లుంది. పైకి మాత్రం సాయం పెంచినట్లు చూపిస్తారు. పేద వర్గాలకు అది దక్కకుండా వ్యూహ చతురతను ప్రదర్శిస్తారు. అడుగడుగునా ఓట్ల మాయ చేయడమే తప్ప నిరుపేదలకు మేలు చేయాలనే ఆలోచన ఏ కోశానా కనిపించడంలేదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే విదేశీ విద్యాదీవెన. తాజాగా ఈ పథకం కింద మూడో విడతకుగాను ఎంపికైన ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు 18 మంది ఉంటే, ఎస్టీ విద్యార్థుల్లో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు.
Education Loan Tips : మీ విద్యా రుణం త్వరగా తీర్చేయాలా?.. ఈ టిప్స్ పాటించండి!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు: గత ప్రభుత్వ హయాంలో అమలైన పథకాన్ని అధికారంలోకి వచ్చాక జగన్ మూడేళ్లపాటు పక్కన పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఏడాది క్రితం అమల్లోకి తెచ్చినా, ఎక్కడా లేని నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా చేశారు. గతేడాది క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్ 200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తామని, తొలుత ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా అన్ని వర్గాలూ కలిపి 213 మంది విద్యార్థులు పథకానికి అర్హత సాధించారు. అయితే, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు 119 మంది మాత్రమే ఉన్నారు. ఆ సంఖ్య కూడా ఎక్కువ అనుకున్నారో, ఏమోగానీ ఆ తర్వాత కోత కోసం మరింత పగడ్బందీగా నిబంధనలు తెచ్చారు. సబ్జెక్టుల అంశాన్ని తెర మీదకు తెచ్చి, వాటిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా ఉత్తర్వుల్లో సవరణ చేశారు. రెండు, మూడు విడతల్లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య,మొదటి విడత కంటే తగ్గింది.