Jagananna Houses Condition: గుంటూరులో నివసించే పేదలకు 12 కిలోమీటర్ల దూరంలోని పేరిచర్ల పరిధిలోని జగనన్న కాలనీలో ఇళ్లస్థలాలు కేటాయించారు. ఇక్కడ మూడో ఆప్షన్ కింద.. ప్రభుత్వమే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. ఇళ్ల నిర్మాణ బాధ్యతను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులకు చెందిన రాక్రిడ్ సంస్థకు అప్పజెప్పింది. ఇక్కడ పనులు సరిగ్గా జరగకపోవడంపై జిల్లా కలెక్టర్.. ప్రభుత్వానికి నివేదిక పంపారు.
దీంతో రాక్రిడ్ సంస్థను తప్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్తవారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించే క్రమంలో నెలల తరబడి నిర్మాణాలు ఆగిపోయాయి. గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించిన పనులు చేపట్టే గుత్తేదారులు.. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణబాధ్యత చేపట్టారు. వేల ఇళ్లకు ఒకేచోట నిర్మాణం జరుగుతున్నా.. పదుల సంఖ్యలోనే కూలీలు పనిచేస్తున్నారు. సరిపడా తాపీమేస్త్రీలు, కూలీలు లేకపోవడంతో.. ఇతర ప్రాంతాల నుంచి పిలిపించి పనులు చేస్తున్నారు.
Jagananna Houses Fraud: జగనన్న ఇళ్ల పేరుతో వాలంటీర్ మోసం.. బాధితుల ఆందోళన
వారు కూడా సరిపడా సంఖ్యలో లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 414 ఎకరాల్లో 18 వేల 50 గృహాలు మంజూరవగా.. 10 వేల 685 ఇళ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభమైంది. మరో 5 వేల 152 ఇళ్లకు పునాది గుంతలు తీశారు. 4 వేల 668 నివాసాలకు కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు. శ్లాబు దశలో 329, పైకప్పు వేసినవి 200 కాగా.., నిర్మాణం పూర్తయినవి కేవలం 336 ఇళ్లు మాత్రమే. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయల సాయం సరిపడక.. చాలా మంది అప్పులు చేసి మరీ విడతలవారీగా నిర్మాణాలు చేసుకుంటున్నారు.