Jagananna Colonies: ఇటీవల కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చినుకుపడినా.. నీరు పోయే మార్గం లేక ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి ఇళ్ల నిర్మాణాల మధ్య నీరు నిలిచి వాటి నాణ్యత ప్రశ్నార్థకమైంది. కోట్లు పోసి మెరక చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, చాలా చోట్ల ఫలితం లేకుండా పోతోంది. కొన్ని లే అవుట్లలో మెరక చేయకుండానే వదిలేయడంతో ముంపునకు గురవుతున్నాయి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు, చెరువు, కాలువలను ఆనుకుని, పొలాల్లోనూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిరుజల్లులకే వాన నీరు చేరుతోంది. నాణ్యత లేకుండా నిర్మించిన అంతర్గత రహదారులు, కాలనీల్లోకి వెళ్లేందుకు ఏర్పాటుచేసిన గ్రావెల్ రోడ్లు.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకముందే రూపును కోల్పోయి గుంతలమయమయ్యాయి. కోట్లు వెచ్చించి వేసిన రోడ్లు కోతకు గురయ్యాయి. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దు రాళ్లు కొన్ని చోట్ల కొట్టుకుపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన జగనన్న కాలనీల్లో మెరక, చదును పనులు చేసేందుకే ప్రభుత్వం ఇప్పటివరకు 2,200 కోట్ల రూపాయల వరకు వెచ్చించింది. ఈ పనులు నాణ్యంగా చేపట్టకపోవడం వల్ల చాలాచోట్ల నిర్మాణాలు పూర్తికాక ముందే మెరక చెదిరింది. అలాంటిచోట మళ్లీ కోట్లు కుమ్మరిస్తున్నారు. మెరక, చదును కోసం సింహభాగం నిధులను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలోనే వినియోగించారు. చివరకు పేదలనుంచి ఓటీఎస్ పేరుతో పిండుకున్న సుమారు 300 కోట్లనూ వినియోగించారు. ఉపాధి హామీ పథకం కింద 1,100 కోట్లు వెచ్చించగా, మరో 800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.