'నేను ఉన్నాను-నేను విన్నాను' నినాదాన్ని మరచిన జగన్- వర్క్‌ఫ్రం హోం అన్నట్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచే సమీక్షలు Jagan Stopped Meeting People After Becoming CM:నేను ఉన్నాను నేను విన్నాను అంటూ విపక్షంలో ఉండగా ఊరూరా జగన్ కొట్టిన డైలాగ్! కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంద్రభవనంలాంటి తాడేపల్లి ప్యాలెస్‌లో.! ఏం వింటున్నారు? అది ఆయనకే తెలియాలి.! గతంలో జనాల్లోకి వెళ్లి తలలు నిమిరినజగన్ ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొని ఏసీ గది దాటడంలేదు. వైసీపీ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఆయన కలవాలనుకుంటేనే ప్రవేశం.! ఇక సామాన్యులకైతే ఆ దరిదాపుల్లోకి ప్రవేశమే గగనం.
కుమార్తె వైద్యానికి సాయం కోసం కాళ్లరిగిలా తిరిగిన కాకినాడ మహిళ ఆరుద్రఅక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించినా సీఎం కదల్లేదు.! పోనీ సచివాలయానికైనా వస్తారా అంటే జగన్‌కు అదంటేనే గిట్టదు.! మూడు నాలుగు నెలలకోసారి కేబినెట్ మీటింగ్‌లుంటే తప్ప సచివాలయం మొహం కూడా చూడరు. కేబినెట్ సమయానికొస్తారు. ముగియగానే నేరుగా తాడేపల్లి వెళ్తారు. అప్పుడూ ప్రజల్ని కలవరు. ఎవరి నుంచీ వినతులుతీసుకోరు. కారులోంచే నవ్వుకుంటూ వెళ్లిపోతారు.
సీఎం జగన్‌కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు
పాలకులెవరైనా ప్రజలతో మమేకమవ్వాలనుకుంటారు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి సహా గత ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకుని ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. ప్రజాదర్బార్లు నిర్వహించేవారు. 2014లో చంద్రబాబు కూడా సీఎంగా రోజూ సామాన్యుల్ని కలవడానికి ఒక గంట, సందర్శకుల్ని కలిసేందుకు మరో గంట సమయం కేటాయించేవారు.
ఇందుకోసం అప్పట్లో ప్రత్యేకంగా ప్రజావేదిక కూడా నిర్మించారు. సందర్శకుల్ని కలిసే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగసంఘాల నాయకులు వంటివారు ప్రత్యేక అపాయింట్‌మెంట్ లేకుండానే సీఎంను వెళ్లి కలిసేవారు. ఎమ్మెల్యేలైతే తమ నియోజకవర్గాలకు చెందినవారినీ తీసుకెళ్లి సీఎంను కలిసేవారు. సామాన్యులందర్నీ ఒక చోట కూర్చోబెడితే సీఎం వెళ్లి వారిని కలిసేవారు. ఇప్పుడా పరిస్థితి లేనేలేదు.
బస్సుల దారి మళ్లించి,బారికేడ్లు పెట్టి, పరదాలు కట్టి- సీఎం జగన్ పర్యటనతో ప్రయాణికులకు నరకయాతన
జనగన్ పర్యటన అంటేనే ప్రజలు బెంబేలు:గతంలో సీఎంలు జిల్లాలకు వెళ్లినప్పుడూ సామాన్యుల్ని కలిసేవారు. జగన్‌కు ఆ అలవాటూ లేదు. సమస్యలు చెప్పడం మాట అటుంచి ఆయన పర్యటన ఉందంటేనే స్థానికులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. రెండ్రోజుల ముందు నుంచే పోలీసుల ఆంక్షలు మొదలవుతాయి. జగన్ రోడ్డుపై ప్రయాణించేదే తక్కువ. ఇక ప్రజల కష్టాలేం తెలుస్తాయి. ఐతే ఇటీవల జగన్ జిల్లాలకు వెళ్లినప్పుడు బాధితుల్ని కలుస్తున్నారని అనిపించుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు.
ఐప్యాక్ టీమ్ ముందుగానే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు కొందరు బాధితుల్ని ఎంపిక చేసి సీఎం వద్దకు తీసుకొస్తోంది. సీఎం అక్కడికక్కడ వారికి కొన్ని వరాలు ప్రకటిస్తున్నారు. వారంతా నిజమైన బాధితులే. వారితో సీఎం మాట్లాడి సాయం అందించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అలాంటి అభాగ్యులు ఇంకెంత మందో ఉంటారు. ఐప్యాక్ దృష్టిలో పడకపోతే సీఎంను కలిసే అవకాశం రాదన్నట్టుగా పరిస్థితి ఉంటే ఎలా?.
ముగిసిన బాబు, పీకే సమావేశం- పార్టీ క్యాడర్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రశాంత్ కిషోర్
బాధితులకు దొరకని భరోసా:వినతులు స్వీకరించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని ‘స్పందన’పై సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఉద్బోధిస్తుంటారు. ఇది ఆయనకూ, ఆయన కార్యాలయానికి మాత్రం వర్తించటం లేదు. సచివాలయానికి వెళ్లే ఉద్దేశం సీఎంకి లేనప్పుడు, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దైనా వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చు! ప్రజల సమస్యలు వినే తీరిక ఓపిక ముఖ్యమంత్రికి లేనప్పుడు కనీసం తన కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికైనా ఆ బాధ్యత అప్పగించొచ్చు! కానీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వినతులు స్వీకరించే ప్రక్రియ చాలా మొక్కుబడిగా సాగుతోంది. సమస్యలతో వచ్చినవారిని పోలీసులు సవాలక్ష ప్రశ్నలు వేశాకే క్యాంప్ ఆఫీసు దగ్గరకు పంపిస్తారు. అక్కడో అధికారి వినతులు తీసుకుని పంపేస్తారు. IAS స్థాయి అధికారి కూడా అందుబాట్లో ఉండరు. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా బాధితులకు దొరకడం లేదు.
అర్థమవుతోందా జగనన్నా?:ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం తేలిక. అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రయ్యాక ప్రజలకు, నాయకుడికి మధ్య కనిపించని అడ్డుగోడలు చాలా ఉంటాయి. అనుమతులు తీసుకోవడం భద్రతా వలయాన్ని ఛేదించుకెళ్లి సామాన్యుడు సీఎంను కలవడం అసాధ్యం జగన్ విషయంలో అది మరింత దుర్లభంగా మారింది. ప్రజావినతులను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కరించాలని సీఎం పదేపదే చెప్తుంటారు. కానీ అదో మొక్కుబడి తంతుగా మారింది. ‘జగనన్నకు చెబుదాం’ అంటూ మెదలు పెట్టిన కార్యక్రమానిదీ అదే తీరు! నేరుగా అర్జీ ఇస్తేనే పరిష్కారం కాలేదు. ఇక ఫోన్‌లో చెబితే అవుతాయా? అర్థమవుతోందా జగనన్నా?.