డ్వాక్రా మహిళలను నట్టేట ముంచిన జగన్ - అక్కచెల్లెమ్మలంటూనే రాయతీల్లో కోత Jagan Scam in Dwakra Zero Interest Schemes:డ్వాక్రా సంఘాల సున్నావడ్డీ పథకం నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. కానీ జరుగుతున్నది ఏటంటే మహిళలపై ‘అక్కచెల్లెమ్మలంటూ ప్రేమ కురిపించే జగన్ పథకాల్లో కోత వేస్తూ పైకి కనిపించకుండా జిత్తులు వేశారు. డ్వాక్రా మహిళల సున్నావడ్డీ రాయితీ' పథకంలో సరిగ్గా ఇదే విధానాన్ని అనుసరించారు. టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు బ్యాంకుల ఇచ్చే రుణ పరిమితి 10 లక్షల వరకు ఉండేది. ఆ లోపు ఎంత రుణం తీసుకున్నా 5 లక్షల వరకు సున్నావడ్డీ రాయితీ వర్తించేది.
జగన్ అధికారంలో రాగానే దీనిని 5 లక్షల నుంచి 3 లక్షలకు తగ్గించారు. డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణానికి ఇది కలిసి వారిపై వడ్డీ భారం అధికమవుతోంది. వడ్డీ ఎందుకు పెరుగుతుందో అర్థంకాక డ్వాక్రా మహిళలు తలలు పట్టుకుంటున్నారు. దీని గురించి ఏమీ మాట్లాడకుండా ఠంచనుగా సున్నావడ్డీ రాయితీకి బటన్ నొక్కుతున్నట్టు జగన్ ప్రకటించేస్తున్నారు.
విద్యుత్ కనెక్షన్లలో స్మార్ట్‌గా జగన్ దోపిడీ - పనేదైనా కమిషన్ కొట్టేయ్
టీడీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ:2021 వరకు డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి పొందే గరిష్ఠ రుణపరిమితి 10 లక్షలుగా ఉంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించి ఎలాంటి తనఖా లేకుండా డ్వాక్రా సంఘాలకిచ్చే రుణపరిమితిని 20 లక్షలకు పెంచింది. చాలా సంఘాలు 10 నుంచి 15 లక్షల వరకు రుణాన్ని పొందుతున్నాయి. అలాంటప్పుడు వారిపై వడ్డీ భారం పడకుండా మేలు చేయాలంటే గత ప్రభుత్వం అమలు చేసిన 5 లక్షల కంటే ఎక్కువగా 7 లక్షలకో 10 లక్షలకో వర్తింపచేయాలి. కానీ జగన్ దీన్ని 3 లక్షలకే పరిమితం చేశారు. ఇప్పటికే ఒకవైపు 2 లక్షలకు రాయితీ కోత పడగా రుణ పరిమితి పెరగడం కారణంగా ఆ మేర వడ్డీ భారమూ పెరిగింది. పైగా తాను వేసిన కోత సంగతి చెప్పకుండా బ్యాంకులతో మాట్లాడి వారు తీసుకునే వడ్డీ శాతాన్ని తగ్గించామని ఇటీవల ఆయన కొత్త పల్లవి అందుకున్నారు.
టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నా వడ్డీని వర్తింపచేశారు. ఏటా క్రమం తప్పకుండా ఈ రాయితీని విడుదల చేయకపోయినా నిధుల లభ్యతకు అనుగుణంగా 5 ఏళ్లలో 2వేల 835 కోట్ల మేర సభ్యులకు అందించారు. ఇంకో 2వేల 100 కోట్లు బకాయిలుండగా తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత బకాయిల్ని చెల్లించాల్సిన బాధ్యత జగన్‌దే అయినా పట్టించుకోవడం లేదు. గతంలో వైఎస్ ప్రభుత్వం వివిధ పథకాలకు పెట్టిన బకాయిల్ని రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక చెల్లించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వమూ ఇదే విధానాన్ని కొనసాగించింది. కానీ జగన్ మాత్రం బకాయిలు ఎగవేశారు.
'నమ్మించు వంచించు'- సొంత జిల్లా ప్రజలను మోసం చేయడానికి సీఎం జగన్ కొత్త పథకం
ఓటీఎస్ పేరుతో ముక్కు పిండి వసూలు:టీడీపీ సర్కారే ఈ పథకాన్ని రద్దు చేసిందని సాకులు చెప్పారు. 30 ఏళ్ల క్రితం నుంచి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు పేదలకు రుణమిచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో ముక్కు పిండి వసూలు చేశారు. డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో నుంచి కూడా బలవంతంగా డబ్బులు కట్టించుకున్నారు. కానీ డ్వాక్రా సంఘాలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని చెల్లించే బాధ్యత తమది కాదని జగన్ ప్రభుత్వం తప్పించుకుంటోంది. ఇచ్చే రుణాల్లోనూ సిబ్బంది కోతలు విధిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో 27 వేల కోట్లు అప్పులతో డ్వాక్రా సంఘాలను కుదేలు చేశారని ఎన్నికల ముందు జగన్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్ సర్కార్‌లో వారిపై 49 వేల కోట్ల అప్పు ఉంది. కానీ ఇప్పుడు డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికంటే టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు, మహిళల స్వయం ఉపాధికి ఎక్కడలేని ప్రోత్సాహం ఉండేది. దీంతో సంఘాలపై నమ్మకం పెరిగి బ్యాంకులు ఇచ్చే రుణాన్ని కూడా క్రమంగా పెంచాయి. ఆ ప్రకారమే అప్పట్లో అప్పూ పెరిగింది. ఈ క్రమంలోనే రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన జగన్ సర్కారు దానిని సైతం తుంగలో తొక్కింది.
YCP Govt Paying Bills Only Jagan Followers: 'వరుస' తప్పిన వైసీపీ సర్కారు..! పక్కదోవలో జగన్ అనుచరులకు వేల కోట్ల పందేరం
నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి తొలగింపు:చిరుద్యోగాలు చేసుకుంటూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న డ్వాక్రా మహిళలపై సీఎం పీఠం ఎక్కగానే జగన్ పగబట్టినట్లు వ్యవహరించారు. కల్యాణమిత్రలు, బీమామిత్రలు, పశుమిత్రలను నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. 7వేల 500 మంది మహిళల్ని రోడ్డున పడేశారు. వివిధ పథకాలను ప్రజలకు చేరువ చేసినందుకు పనిని బట్టి వీరికి నెలకు 10 వేల నుంచి 20 వేల వరకు వేతనం ఉండేది. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్లు నిండిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛను ఇచ్చేందుకుగానూ 2009లో అభయహస్తం పింఛన్ పథకాన్ని తీసుకొచ్చారు. అర్హత గల మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వం వాటా కలిపి మొత్తం 2 వేల కోట్ల వరకు చేరింది. ఎల్ఐసీని ఆ పథకం నుంచి తప్పించిన జగన్ సర్కార్ ఆ మొత్తాన్ని తీసేసుకుంది.
ఎస్సీ, ఎస్టీలపై జగన్ శీతకన్ను:డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వాలు అమలుచేసిన ఉన్నతి పథకంపైనా జగన్ శీతకన్ను వేశారు. 2014-19 మధ్య అప్పటి సర్కార్ వీరి కోసమే 800 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తమూ వడ్డీ లేకుండా రుణంగా ఇచ్చి నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. స్వయం ఉపాధిని కల్పించి చేయూతను అందించింది. దీనికి నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించలేదు. దీంతో పథకాన్ని నిలిపేయలేక గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. మహిళా సాధికారతతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసేలా జగన్ సర్కార్ పనిచేస్తోంది.